బహ్రెయిన్‌లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు | Funerals for Gulf worker who died five years ago in Bahrain | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు

Nov 4 2025 5:50 PM | Updated on Nov 4 2025 9:24 PM

Funerals for Gulf worker who died five years ago in Bahrain

బహ్రెయిన్‌లో అంత్యక్రియలకు సమ్మతిస్తూ మృతిడి భార్య అఫిడవిట్ దాఖలు

 సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్‌కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారు

తదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్‌ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి,  సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్‌ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement