వెంకటేశ్ అయ్యర్ (PC: IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.
పదమూడు ఖాళీలు
వేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్లు వెంకటేశ్ అయ్యర్ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
మాక్ వేలం
ఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈసారి కూడా మాక్ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అతడి కోసం పోటీపడ్డాయి.
భారీగా తగ్గిన ధర!..
ఇంతలో కేకేఆర్ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్ అయ్యర్‌ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్ వేలంలో కేకేఆర్ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను కేకేఆర్ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్ వేలంలో కేకేఆర్ లివింగ్‌స్టోన్‌ను కొనుక్కోవడం గమనార్హం.


