ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలం కోసం ఆయా ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయి. అయితే ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అవుతారనే ఆసక్తి అందరిలో నెలకొంది.
గత ఏడాది జెడ్డాలో జరిగిన వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు రిషబ్ పంత్‌ను భారీ మొత్తం రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర. అయితే ఈసారి కూడా ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఫ్రాంచైజీల వద్ద మొత్తం పర్స్ విలువ రూ. 230 కోట్లకు పైగా ఉంది.
పర్స్ బ్యాలెన్స్ అత్యధికం ఏ జట్టుదంటే?
ఐపీఎల్-2026 మినీ వేలంలో అత్యధిక పర్స్ వాల్యూ కోల్‌కతా నైట్‌రైడర్స్(64.30 కోట్లు) వద్ద ఉంది. ఆ తర్వాత స్ధానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ (43.40 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (25.50 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 22.95 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ (21.80 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(16.40 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(16.05 కోట్లు), గుజరాత్ టైటాన్స్(12.90 కోట్లు), పంజాబ్ కింగ్స్ (11.50 కోట్లు), ముంబై ఇండియన్స్(2.75 కోట్లు) ఉన్నాయి. అత్యధికంగా కేకేఆర్ జట్టులో అత్యధికంగా 13 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అత్యల్పంగా పంజాబ్ కింగ్స్‌లో నాలుగు స్ధానాల్లో ఖాళీలు ఉన్నాయి.
గ్రీన్‌పై కాసుల వర్షం!
ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమయ్యాడు. అయితే సాధారణంగా ఆల్-రౌండర్ అయిన గ్రీన్, ఈసారి వేలంలో తన పేరును 'బ్యాటర్ల' విభాగంలో నమోదు చేసుకున్నాడు.
దీంతో వేలంలో మొదటి సెట్లలోనే అతడు పేరు వస్తుంది. మొదటిలో ఫ్రాంచైజీల వద పర్స్ మొత్తం ఫుల్‌గా ఉండడంతో అతడి కోసం పోటీ పడడం ఖాయం. గ్రీన్‌ను సొంతం చేసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశముందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
కేకేఆర్ సరైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడు. గత సీజన్ వరకు జట్టులో ఉన్న ఆండ్రీ రస్సెల్‌ను కేకేఆర్ విడుదల చేసింది. ఆ తర్వాత అతడు ఏకంగా ఐపీఎల్‌కే రిటైర్మెంట్ ప్రకటించి కేకేఆర్ పవర్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని గ్రీన్‌తో భర్తీ చేయాలని కేకేఆర్ భావిస్తోంది.
సీఎస్‌కే కూడా సామ్ కుర్రాన్‌ను రాజస్తాన్‌కు ట్రేడ్ చేయడంతో వారికి కూడా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం. కాబట్టి చెన్నై కూడా అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత రిపోర్ట్‌లు ప్రకారం.. అతడు వేలంలో రూ. 20 కోట్లకు పైగా ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రీన్ చివరగా ఐపీఎల్ 2024లో ఆర్సీబీ తరపున ఆడాడు. ఆ సీజన్‌లో 255 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
బిష్ణోయ్ కోసం ఎస్ఆర్‌హెచ్ స్కెచ్!
కామెరూన్ గ్రీన్‌తో పాటు టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంది. గత సీజన్ వరకు లక్నోలో భాగంగా ఉన్న బిష్ణోయ్‌ను సదరు ఫ్రాంచైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో స్పిన్ బౌలర్ల అవసరమున్న ఫ్రాంచైజీల అతడి కోసం పోటీ పడనున్నాయి.
ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఎస్ఆర్‌హెచ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ ఒకరు లేరు. జీషన్ అన్సారీ ఉన్నప్పటికి అతడికి అంతర్జాతీయ స్దాయిలో అనుభవం లేదు.
కాబట్టి బిష్ణోయ్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని కావ్య మారన్ వ్యూహాలు రచిస్తోంది. అదేవిధంగా సీఎస్‌కే కూడా పోటీ పడే అవకాశముంది. ఎందుకంటే సీఎస్‌కేలో లెగ్ స్పిన్నర్ ఒక్కరూ కూడా లేదు. జడేజాను సైతం సీఎస్‌కే వదులుకుంది. మతీషా పతిరానా కోసం కూడా ఎస్‌ఆర్‌హెచ్ ప్రయత్నించే ఛాన్స్ ఉంది. మహ్మద్ షమీ స్దానాన్ని అతడితో భర్తీ చేయాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తుందంట.
పృథ్వీషాపై సీఎస్‌కే కన్ను..
ఇక గత సీజన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన పృథ్వీ షా.. ఈసారి మాత్రం ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. పృథ్వీషా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముంబై నుంచి మహారాష్ట్రకు మకాంను మార్చిన పృథ్వీ.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. అతడిని సీఎస్‌కే సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే అతడితో సీఎస్‌కే యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దూకడైన ఆటకు పృథ్వీ పెట్టింది పేరు.
వెంకటేశ్ అయ్యర్‌కు షాక్ తప్పదా?
ఇక కేకేఆర్ మాజీ ఆల్‌రౌండర్, మధ్యప్రదేశ్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్‌కు మరోసారి షాక్ తగిలే అవకాశముంది. గత సీజన్‌లో అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ అయ్యర్ తన ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయాడు.
దీంతో అతడిని నైట్‌రైడర్స్ వేలంలోకి విడిచిపెట్టింది. అయితే అయ్యర్ వేలంలోకి వచ్చినప్పటికి భారీ ధర దక్కే అవకాశం లేదు. ఎందుకంటే అతడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ప్రభావం వేలంపై ఆడే అవకాశముంది.


