ఐపీఎల్-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను మొత్తం పది ఫ్రాంచైజీలు సిద్దం చేసుకుంటున్నాయి.
గతేడాది సీజన్‌లో ఆరోస్ధానానికి పరిమితమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం వేలంలో చాకచాక్యంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ మినీ ఆక్షన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ దాదాపు తమ కోర్ టీమ్‌ను అంటిపెట్టుకుంది.
అయితే మహ్మద్ షమీ లాంటి కీలక పేసర్‌ను లక్నోకు సన్‌రైజర్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్-2025లో షమీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ కారణంతోనే అతడిని ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు వేలంలో అతడి స్ధానాన్ని మరో ఫ్రంట్ లైన్ సీమర్‌తో భర్తీ చేయాలని ఎస్‌ఆర్‌హెచ్ యోచిస్తోంది.
పతిరానపై కన్ను..
సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌లో 25.50 కోట్లు ఉన్నాయి. కనిష్టంగా ముగ్గురు, గరిష్టంగా పది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే షమీ స్ధానాన్ని మినీ వేలంలో స్వదేశీ పేసర్‌తో భర్తీ చేయడం కష్టం. వేలంలో చెప్పుకోదగ్గ స్వదేశీ ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు.
అందుకే శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానాపై ఎస్ఆర్‌హెచ్ కన్నేసినట్లు తెలుస్తోంది. పతిరానా గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ మినీ వేలానికి ముందు అతడిని సీఎస్‌కే విడిచిపెట్టింది.
దీంతో అతడిపై వేలంలో కాసుల వర్షం కురిసే అవకాశముంది. పతిరానా కోసం అవసరమైతే తమ పర్స్‌లో ఉన్న సగం మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సన్‌రైజర్స్ సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్ పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్‌కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు.
మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. దీంతో అతడిని ఎలాగైనా కొనుగోలు చేసి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ఉపయోగించుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
విదేశీ ఆటగాళ్లు (6): పాట్ కమిన్స్✈️ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్✈️ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్✈️, కమిందు మెండిస్✈️, ఇషాన్ మలింగ✈️, బ్రైడన్ కార్స్✈️.
దేశీయ ఆటగాళ్లు (9): అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ.
SRH విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా
అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా✈️, అథర్వ తైడే (వికెట్ కీపర్), రాహుల్ చాహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, వియాన్ ముల్డర్✈️.
చదవండి: బీసీసీఐ కీలక సమావేశం..


