కాంస్య పతక మ్యాచ్‌లో అర్జెంటీనాపై 4–2తో విజయం
చివరి 11 నిమిషాల్లో 4 గోల్స్ చేసిన టీమిండియా
ఫైనల్లో స్పెయిన్‌పై గెలిచి టైటిల్ నిలబెట్టుకున్న జర్మనీ
చెన్నై: సొంతగడ్డపై జరిగిన పురుషుల జూనియర్ అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని యువ భారత జట్టు 4–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున అంకిత్ పాల్ (49వ నిమిషంలో), మన్‌మీత్ సింగ్ (52వ నిమిషంలో), శార్దానంద్ తివారి (57వ నిమిషంలో), అన్‌మోల్ ఎక్కా (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
అర్జెంటీనా జట్టుకు నికోలస్ రోడ్రిగెజ్ (3వ నిమిషంలో), సాంటియాగో ఫెర్నాండెజ్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఒకదశలో 0–2తో వెనుకబడి ఓటమి వైపు పయనిస్తున్న యువ భారత జట్టు చివరి 11 నిమిషాల్లో ఒక్కసారిగా విజృంభించింది. ఏకంగా నాలుగు గోల్స్ చేసి అద్భుత విజయాన్ని సాధించింది. భారత్ చేసిన నాలుగు గోల్స్‌లో మూడు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా, ఒకటి పెనాల్టీ స్ట్రోక్ ద్వారా రావడం విశేషం.
మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్... అర్జెంటీనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. 46 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత జట్టు కాంస్య పతకం సాధించడం ఇదే తొలిసారి. 2001లో, 2016లో విజేతగా... 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత్ 2005, 2021, 2023లలో కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగో ప్రయత్నంలో భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో నెగ్గడం విశేషం.
ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు
కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 5 లక్షలు... కోచింగ్ బృందంలోని వారికి రూ. 2 లక్షల 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది.
జర్మనీ 8వ సారి...
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ‘షూటౌట్’కు దారితీసిన ఫైనల్లో జర్మనీ 3–2 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టును ఓడించి ఎనిమిదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో జర్మనీ 1982, 1985, 1989, 1993, 2009, 2013, 2023లలో కూడా విజేతగా నిలిచింది.


