సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున హీనా బానో 58వ నిమిషంలో ఏకైక గోల్ చేసింది. జర్మనీ జట్టుకు లీనా ఫ్రెరిచ్స్ (5వ నిమిషంలో), అనిక షానాఫ్ (52వ నిమిషంలో), మార్టినా రీసెంగర్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి.
అయితే భారత్ ఒక్క దానిని మాత్రమే సది్వనియోగం చేసుకుంది. మరోవైపు జర్మనీ జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. ఇందులో జర్మనీ ఒక పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్స్‌గా మలిచింది. మరోటి ఫీల్డ్ గోల్‌గా వచ్చింది. చివరి పది నిమిషాల్లో భారత్ పట్టుకోల్పోయి రెండు గోల్స్ సమర్పించుకోవడం గమనార్హం. నాలుగు జట్లున్న గ్రూప్ ‘సి’లో జర్మనీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
భారత్, ఐర్లాండ్ మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో భారత్ తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలిసారి 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీలో ఆరు గ్రూప్‌లు చేశారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆరు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.


