చిలీపై 7–0 గోల్స్‌తో ఘనవిజయం
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 7–0 గోల్స్ తేడాతో చిలీ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున రోషన్ కుజుర్ (16వ, 21వ నిమిషాల్లో), దిల్‌రాజ్ సింగ్ (25వ, 34వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... అజీత్ యాదవ్ (35వ నిమిషంలో), అన్‌మోల్ ఎక్కా (48వ నిమిషంలో), కెప్టెన్ రోహిత్ (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ఒమన్ జట్టుతో భారత్ తలపడుతుంది. చిలీతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. అయితే ఖాతా తెరవడానికి సమయం తీసుకుంది. తొలి క్వార్టర్‌లో గోల్స్ చేసేందుకు వచ్చిన అవకాశాలను భారత్ చేజార్చుకుంది. దాంతో తొలి క్వార్టర్‌లో రెండు జట్లు 0–0తో సమంగా నిలిచాయి. రెండో క్వార్టర్ మొదలైన తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది.
మన్‌మీత్ సింగ్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న రోషన్ కుజుర్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత రోషన్, దిల్‌రాజ్ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేశారు. రెండో క్వార్టర్ ముగిసేసరికి భారత్ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో భారత్ మరో మూడు గోల్స్ చేసింది. నిమిషం వ్యవధిలో దిల్‌రాజ్, అజీత్ ఒక్కో గోల్ చేశారు. మూడో క్వార్టర్ ముగిసేసరికి భారత్ 6–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
చివరి క్వార్టర్‌లో చిలీ రక్షణపంక్తి అప్రమత్తంగా ఉండటంతో భారత్ ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ ఆఖరి నిమిషంలో కెపె్టన్ రోహిత్ గోల్‌తో భారత్ 7–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించగా... రెండింటిని గోల్స్‌గా మలిచింది. లభించిన ఒక్క పెనాల్టీ స్ట్రోక్‌ను రోహిత్ సది్వనియోగం చేసుకున్నాడు.
టోర్నీ తొలి రోజు శుక్రవారం జరిగిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఫలితాలు రావడం విశేషం. మదురైలో జరిగిన పూల్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో జర్మనీ 4–0తో దక్షిణాఫ్రికాపై, ఐర్లాండ్ 4–3తో కెనడాపై గెలిచాయి. పూల్ ‘బి’ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 4–0తో ఒమన్‌ను ఓడించింది. పూల్ ‘డి’ మ్యాచ్‌ల్లో బెల్జియం 12–1తో నమీబియాపై, స్పెయిన్ 8–0తో ఈజిప్ట్‌పై విజయం సాధించాయి. పూల్ ‘సి’ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 4–1తో జపాన్‌పై, న్యూజిలాండ్ 5–3తో చైనాపై గెలిచి శుభారంభం చేశాయి.


