పసలేని భారత బౌలింగ్
దక్షిణాఫ్రికా 489 ఆలౌట్
ముత్తుసామి శతకం
యాన్సెన్ సెంచరీ మిస్
సఫారీతో ఆడుతోంది భారతగడ్డపైనే అయినా సవాల్ మాత్రం భారత్‌కే ఎదురవుతోంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ అదిరింది... కానీ బ్యాటింగ్ కుదరక, చిన్న లక్ష్యాన్ని సైతం చేధించలేక శుభారంభం చెదిరింది. ఈ రెండో టెస్టులో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాల్సిన మన పేస్ బేల చూపులు చూసింది. తిప్పేయాల్సిన స్పిన్ తెల్లమొహమేసింది. వెరసి దక్షిణాఫ్రికా భారీ స్కోరే చేసింది. ఇప్పుడు భారమంతా భారత బ్యాటర్లపైనే పడింది.
గువాహటి: రెండో టెస్టులో దక్షిణాఫ్రికా దంచేసింది. ఈ రెండు రోజులూ సఫారీదే పైచేయి! భారత బౌలింగ్ భారత గడ్డపై ఎంతలా భంగపడిందంటే... ఏడో వరుస బ్యాటింగ్‌కు దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ సేనురాన్ ముత్తుసామి (206 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక్కొట్టగా... తొమ్మిదో వరుస పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ మిస్ చేసుకున్నా... వన్డే తరహా ధాటిని కనబరిచాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 151.1 ఓవర్లలో 489 పరుగుల భారీస్కోరు వద్ద ఆలౌటైంది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. బుమ్రా, సిరాజ్, జడేజా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (7 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకా 480 పరుగుల సుదూరంలోనే ఆతిథ్య జట్టు ఉంది.
తొలి సెషన్‌లో ఫిఫ్టీ, రెండో సెషన్‌లో శతక్కొట్టి...
సఫారీ ఓవర్‌నైట్ స్కోరు 247/6. అంటే స్పెషలిస్టు బ్యాటర్లంతా అవుటయ్యారు. ఇక మిగిలిందల్లా బౌలింగ్ ఆల్‌రౌండర్లే. వీరిని మన స్పిన్ త్రయం, పేస్ త్రయం తేలిగ్గా పడేస్తుందనుకుంటే ఓవర్‌నైట్ బ్యాటర్లు ముత్తుసామి, వెరీన్ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. దీంతో తొలిసెషన్‌లో ఆరుగురి ఆతిథ్య బౌలర్ల శ్రమ ఏమాత్రం ఫలించనేలేదు. ముత్తుసామి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... వెరీన్ ఆ దిశగా కదిలాడు.
జట్టు స్కోరు 316/6 వద్ద టీ విరామానికెళ్లారు. ఎట్టకేలకు తొలిసెషన్‌లో లభించని సాఫల్యం రెండో సెషన్‌లో దక్కింది. వెరీన్ (45; 5 ఫోర్లు)ను జడేజా అవుట్ చేయడంతో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ఈ వికెట్ ఆనందం ఆలౌట్‌కు తీసుకెళ్లలేదు. యాన్సెన్ రాకాతో అంతలోనే ఆవిరైంది. ఈ క్రమంలో ముత్తుసామి శతకం, యాన్సెన్ అర్ధశతకం పూర్తయ్యాయి.
428/7 వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్ ఆరంభంలో ముత్తుసామి అవుటైనప్పటికీ హార్మర్ (5), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్)ల కొసరంత అండతోనే యాన్సెన్ మరో 58 పరుగులు జతచేశాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుటవడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు 489 వద్ద తెరపడింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (బి) బుమ్రా 38; రికెల్టన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 35; స్టబ్స్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 49; బవుమా (సి) జైస్వాల్ (బి) జడేజా 41; టోని జోర్జి (సి) పంత్ (బి) సిరాజ్ 28; ముల్డర్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 13; ముత్తుసామి (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 109; వెరీన్ (స్టంప్డ్) పంత్ (బి) జడేజా 45; యాన్సెన్ (బి) కుల్దీప్ 93; హార్మర్ (బి) బుమ్రా 5; కేశవ్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (151.1 ఓవర్లలో ఆలౌట్) 489. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–166, 4–187, 5–201, 6–246, 7–334, 8–431, 9–462, 10–489. బౌలింగ్: బుమ్రా 32–10–75–2, సిరాజ్ 30–5–106–2, నితీశ్ 6–0–25–0, సుందర్ 26–5–58–0, కుల్దీప్ 29.1–4–115–4, జడేజా 28–2–94–2.
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 7; రాహుల్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 9. బౌలింగ్: యాన్సెన్ 3.1–1–9–0, ముల్డర్ 3–3–0–0.


