మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా టీమిండియాతో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా, తొలి మ్యాచ్‌లోనే అద్భుతం చేసింది.
ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాను భయపెట్టింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఆతర్వాత బౌలింగ్‌లో అద్వితియమైన పోరాటపటిమ కనబర్చింది. సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టుకు ఓ దశలో గెలుపు భయం చూపించింది. బౌలింగ్ విభాగంలో ఏకైక అనుభవజ్ఞుడు కైల్ జేమీసన్‌తో భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. 4 వికెట్లు తీసి టీమిండియాను ఇబ్బంది పెట్టిన జేమీసన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు జీవం పోసిన డారిల్ మిచెల్‌ను కొనియాడాడు. తమ జట్టు పోరాటపటిమను ఆకాశానికెత్తాడు.
బ్రేస్‌వెల్ మాటల్లో.. ఓడినా, గర్వంగా ఉంది. ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం. మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. గాయం నుంచి తిరిగొచ్చిన జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు.. ముఖ్యంగా డారిల్ మిచెల్ తన అనుభవాన్నంతా రంగరించి మంచి స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. అయినా మరో 20-30 పరుగులు చేసుండాల్సింది.
మ్యాచ్ గతి మార్చే క్షణాలను సృష్టించుకోవడం గురించి మేమెప్పుడూ మాట్లాడుకుంటాం. ఈ రోజు కొన్ని విషయాల్లో బాగా పని చేశాం. కొన్ని కీలక అవకాశాలు కోల్పోయాం. భారత్‌లో లైట్ల వెలుతురులో ఆడటం సులభం కాదని మరోసారి నిరూపితమైంది. ఓడినా మా జట్టు ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తుంది. బ్రేస్‌వెల్ చేసిన ఈ వ్యాఖ్యలు వారి జట్టు పోరాట స్పూర్తిని సూచిస్తున్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.
అనంతరం విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది.


