మరో మైలురాయిని తాకిన రోహిత్‌ శర్మ | IND VS NZ 1st ODI: Rohit sharma reaches 650 sixers milestone | Sakshi
Sakshi News home page

మరో మైలురాయిని తాకిన రోహిత్‌ శర్మ

Jan 12 2026 10:57 AM | Updated on Jan 12 2026 11:09 AM

IND VS NZ 1st ODI: Rohit sharma reaches 650 sixers milestone

టీమిండియా వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయిని తాకాడు. వడోదరలో న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 11) జరిగిన వన్డే మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్ల మైలురాయిని (539 ఇన్నింగ్స్‌ల్లో) చేరుకున్నాడు. 

ప్రపంచ క్రికెట్‌లో రోహిత్‌ ఇప్పటికే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తాజాగా మరో మైలురాయిని తాకి, తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్‌ తర్వాతి స్థానంలో విండీస్‌ విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌ (551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు) ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62), డారిల్‌ మిచెల్‌ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం 301 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ ఆదిలో సునాయాస విజయం దిశగా సాగినప్పటికీ.. విరాట్‌ కోహ్లి ఔటయ్యాక తడబాటుకు లోనైంది. అయితే కేఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌) హర్షిత్‌ రాణా (29) సహకారంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

అంతకుముందు కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్‌) మరో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ (56), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (49) కూడా రాణించారు. రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 26; 3 ఫోరు​, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. 

మొత్తంగా అందరూ తలో చేయి వేయడంతో భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది.

కాగా, ఈ సిరీస్‌కు న్యూజిలాండ్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా తొలి వన్డేలో అ‌ద్భుతంగా రాణించి, ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టు టీమిండియాకు ఊహించని పోటీనిచ్చింది. ఫీల్డింగ్‌లో కాస్త తడబడినా.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సత్తా చాటి ఆకట్టుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement