వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్‌మ్యాన్’ రోహిత్, ‘కింగ్’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది.
రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్‌లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్‌లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.


