breaking news
Legends Club
-
గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...
వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్‌మ్యాన్’ రోహిత్, ‘కింగ్’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది. రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్‌లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్‌లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. -
లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కపిల్
ముంబై: విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు చెందిన ‘లెజెండ్స్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈమేరకు భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, నారీ కాంట్రాక్టర్, అజిత్ వాడేకర్ సమక్షంలో కపిల్ జ్ఞాపికను అందుకున్నారు. లెజెండ్స్ క్లబ్ అధ్యక్షుడు మాధవ్ ఆప్టే దీన్ని బహూకరించారు. గావస్కర్ కూడా వాడేకర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. తమ చండీగఢ్‌లో టర్ఫ్ వికెట్లు కూడా ఉండేవి కావని, శిక్షణ ఇచ్చేందుకు కూడా ఎవరూ ఉండేవారు కాదని కపిల్ గుర్తుచేసుకున్నారు. కానీ ముంబైలో ఆధునిక శిక్షణ దొరికేదని చెప్పారు. ఇక కపిల్‌తో కలిసి ఒకే జట్టులో ఆడడం తనకు దక్కిన గౌరవంగా గావస్కర్ చెప్పుకొచ్చారు.


