టెహ్రాన్: ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఆదివారం నాడు ఇరాన్‌లోని తమ మిలటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి Tu-214PU 'డూమ్స్‌డే' (ప్రళయ) విమానాన్ని టెహ్రాన్‌కు పంపింది. ఈ చర్య ద్వారా ఇరాన్‌కు మాస్కో బహిరంగంగానే తమ అండను ప్రకటించినట్లయింది.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ముగింపుకు రాలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించే లోపే, పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్న ఈ తరుణంలో, రష్యా ఇరాన్‌కు ఒక అత్యాధునిక విమానాన్ని పంపడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఏ విధంగా ఉపయోగం
ఇరాన్‌కు అమెరికా నుంచి దాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతోంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకొస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ముందే అప్రమత్తం చేస్తోంది.ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం ఇప్పుడు ఇరాన్‌కు చేరుకోవడం హాట్‌టాఫిక్‌గా మారింది. దీని రాకతో ఇరాన్‌కు రక్షణ పరంగా మరింత బలం చేకూరిందనేది వాస్తవం.
Tu-214PU ప్రత్యేకతలు
ఇది సాధారణ విమానం కాదు. ఇందులో అత్యంత సురక్షితమైన ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్, కంట్రోల్ నెట్‌వర్క్‌లు, ప్రత్యేక డేటా లింక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సదుపాయాల వల్ల సంక్షోభ సమయాల్లో విమానంలో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే దీనిని రష్యా "ప్రళయ విమానం" అని పిలుస్తుంది.
భూమిపై అణు దాడులు సంభవించినప్పుడు దేశ అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఈ విమానంలోకి ఎక్కి ఆకాశం నుంచే యుద్ధ వ్యూహాలను రచించవచ్చు. కాక్‌పిట్ మినహా ఈ విమానానికి ఎలాంటి కిటికీలు ఉండవు. ఇది అణు విస్ఫోటనం వల్ల వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల నుండి లోపల ఉన్నవారిని రక్షిస్తుంది. అలాగే ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల, వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ప్రయాణించగలదు.
అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు.


