మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం | US Launches Fresh Airstrikes On Iran Near Strait Of Hormuz As Middle East Tensions Escalate, Global Oil Supply At Risk | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

Jul 13 2026 6:46 AM | Updated on Jul 13 2026 10:14 AM

Trump Pulls the Trigger Again: War Escalates at the Strait of Hormuz

వాషింగ్టన్‌/టెహ్రాన్‌: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్‌ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి దూకుడు ప్రదర్శించారు. హర్ముజ్‌ జలసంధి పరిసరాల్లోని ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఆదివారం సాయంత్రం నుంచి తాజా వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ చర్యలు కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ దాడులకు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రకటించింది.

ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్‌ జలసంధి ఇప్పుడు అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రధాన యుద్ధరంగంగా మారింది. "వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్‌ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం" అని సెంట్‌కామ్‌(CENTCOM)  ప్రకటించింది. మరోవైపు అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్‌లో రాకపోకలను అనుమతించబోమని ఇరాన్‌ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రబిందువైంది.

ఓవైపు దాడులు, మరోవైపు..
అమెరికా తాజా దాడులు హర్మొజ్‌ జలసంధికి సమీపంలోని హోర్మోజ్‌గాన్‌, ఖుజెస్టాన్‌, సిస్తాన్-బలూచిస్తాన్‌ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్‌ అబ్బాస్‌, జాస్క్‌, సిరిక్‌, ఖెష్మ్‌ దీవి, చాబహార్‌ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. ఖొండాబ్‌లోని హెవీ వాటర్‌ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం.

దీనికి ప్రతిగా హర్ముజ్‌ గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) కాల్పులు జరిపిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్‌ ప్రయోగించిన ఒక క్రూయిజ్‌ క్షిపణి, ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.

నీటి పంపింగ్‌ కేంద్రంపై దాడి.. ఒకరు మృతి
ఖుజెస్టాన్‌ ప్రావిన్స్‌లోని మహ్షహర్‌ ప్రాంతంలో వ్యవసాయ నీటి పంపింగ్‌ స్టేషన్‌పై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.

ఐదో విడత దాడులు
కాల్పుల విరమణ ప్రకటించి మూడు వారాలు కూడా గడవకముందే అమెరికా ఐదో విడత వైమానిక దాడులు చేపట్టింది. శనివారం ఒక్కరోజే ఇరాన్‌లో 140కి పైగా లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా.. తాజా దాడులతో మరింత ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బహ్రెయిన్‌, ఖతార్‌, కువైట్‌, ఒమన్‌, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.

క్షీణించిన నౌకల రాకపోకలు
యుద్ధ ప్రభావం సముద్ర రవాణాపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు హర్ముజ్‌ జలసంధిని దాటుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్‌ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 79 డాలర్ల వద్దకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరిగింది.

భారత్‌కూ ప్రభావం
ఒమన్‌ తీరంలో దాడికి గురైన జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ GFS Galaxy కంటైనర్‌ నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో 23 మందిని రక్షించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మరో నావికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్ముజ్‌లో పరిస్థితులు మరింత దిగజారితే భారత చమురు దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ముందు ఏం జరుగుతుంది?
హర్ముజ్‌ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా-ఇరాన్‌ ఎవరూ వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులతో ఒత్తిడి పెంచుతుంటే.. మరోవైపు ఇరాన్‌ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement