కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తన ప్రభుత్వంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా ప్రధాని యూలియా స్విరిడెంకో ఆదివారం రాజీనామా చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతుండటంతో పదవీ కాలం ముగిసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జెలెన్‌స్కీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో యూలియా అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.
ఈ ఒప్పందం తర్వాత ఆమె 2025 జూలైలో తన 39వ ఏట ప్రధానిగా నియమితులయ్యారు. తనకు మరింత కీలకమైన పదవిని ఇస్తానంటూ జెలెన్‌స్కీ వాగ్దానం చేసినట్లు రాజీనామా అనంతరం యూలియా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఆ పదవి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందంటూ యూలియా స్విరిడెంకో రాజీనామా నేపథ్యంలో జెలెన్‌స్కీ ప్రకటించడం గమనార్హం.
ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామి దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో ఆమెకు అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లోనూ భారీగా మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంధన మంత్రి డెనిస్ ష్మిహాల్, అంతర్గత శాఖ మంత్రి ఇహోర్ క్లిమెంకో, రక్షణ మంత్రి మైఖెయిలో ఫెదొరొవ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత నాలుగేళ్లలో ఇది నాలుగో కీలక ప్రక్షాళన కానుంది.


