ఖతార్‌లో నాలుగు రోజులు సెలవులు | Qatar 4-Day Holiday Former Emir Sheikh Hamad bin Khalifa Al Thani Death | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో నాలుగు రోజులు సెలవులు

Jul 13 2026 3:31 AM | Updated on Jul 13 2026 3:34 AM

Qatar 4-Day Holiday Former Emir Sheikh Hamad bin Khalifa Al Thani Death

దోహా: ఖతార్ మాజీ అమీర్ (ఫాదర్ అమీర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంతో ఆ దేశం నాలుగు రోజుల అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. జూలై 12 నుంచి సంతాప దినాలు అమల్లోకి వచ్చాయని ఖతార్ అమిరీ దివాన్ వెల్లడించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనత స్థితిలో ఎగురవేయనున్నారు. అలాగే జూలై 13 నుంచి మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు జూలై 19న తిరిగి విధుల్లో చేరనున్నారు.

1995 నుంచి 2013 వరకు ఖతార్‌ను పాలించిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీని ఆధునిక ఖతార్ రూపశిల్పిగా వ్యవహరిస్తారు. సహజ వాయువు (LNG) వనరులను సమర్థంగా వినియోగించి ఖతార్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలోనే ‘అల్ జజీరా’ మీడియా నెట్‌వర్క్ స్థాపించబడింది. 2022 ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు సాధించడం, ఖతార్‌ను అంతర్జాతీయ దౌత్య, పెట్టుబడులు, క్రీడా రంగాల్లో కీలక కేంద్రంగా నిలబెట్టడం ఆయన నాయకత్వంలోని ప్రధాన విజయాలుగా భావిస్తారు.

2013లో అరుదైన నిర్ణయం తీసుకుంటూ స్వచ్ఛందంగా అధికారాన్ని తన కుమారుడు, ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి అప్పగించారు. ఆ తర్వాత కూడా దేశ అభివృద్ధికి మార్గదర్శకుడిగా కొనసాగారు. ఆయన మృతిపై ప్రపంచ దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేస్తుండగా, భారత ప్రభుత్వం కూడా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించి జాతీయ పతాకాన్ని అవనత స్థితిలో ఎగురవేయాలని నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement