బ్యాంకాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి | Bangkok Pub Fire 27 Dead Dozens Injured in Midnight Inferno | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి

Jul 13 2026 1:45 AM | Updated on Jul 13 2026 2:37 AM

Bangkok Pub Fire 27 Dead Dozens Injured in Midnight Inferno

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక ప్రముఖ పబ్‌లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించి 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు.బ్యాంకాక్‌ చటుచాక్ జిల్లాలోని ‘రోంగ్ బీర్ నా లాడ్‌ప్రాయో’ పబ్‌లో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

ఉక్కిరిబిక్కిరి చేసిన దట్టమైన పొగ

అధికారుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పబ్ ప్రవేశ ద్వారం వద్ద మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న కస్టమర్లు బయటకు రావడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసిన పలువురు కస్టమర్లు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మృతదేహాలు పబ్‌లోని రెస్ట్‌రూమ్‌లలో లభ్యమవడం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న ప్రధాని

ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు స్టేషన్ల నుండి వాహనాలతో తరలివచ్చి దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో 27 మంది మరణించినట్లు ఆయన అధికారికంగా ధ్రువీకరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పబ్‌లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

గతాన్ని గుర్తుచేస్తున్న విషాదం

ఈ ప్రమాదం థాయ్‌లాండ్‌లో గతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదాలను గుర్తుకు తెస్తోంది. 2022లో తూర్పు థాయ్‌లాండ్‌లోని ఒక మ్యూజిక్ పబ్‌లో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. అంతకుముందు 2009లో బ్యాంకాక్‌లోని శాంతికా నైట్‌క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement