టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించని మొజ్తబా ఖమేనీ వచ్చే వారంలో తొలిసారి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకునిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు.
తాజాగా తన తండ్రి అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం జూలై 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు టెహ్రాన్‌లో మొజ్తబా ఖమేనీ స్మారక సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటనలో దివంగత నేతను ‘అమర ముజాహిద్ ఇమామ్’గా అభివర్ణించారు.
తండ్రి అంత్యక్రియలకు దూరం
ఇటీవల జరిగిన అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో వేలాది మంది సమక్షంలో జరిగిన ఈ సభలో మొజ్తబా సోదరులు ముగ్గురు (మొస్తఫా, మేసమ్, మసౌద్ ఖమేనీ) మాత్రమే ప్రార్థనలు జరిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికలను ఈ అంత్యక్రియల్లో పక్కపక్కనే ఉంచారు. దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టినప్పటికీ, ఈ అంత్యక్రియల్లో మొజ్తబా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.


