హర్మూజ్‌ జలసంధిని మూసేస్తున్నాం : ఇరాన్‌ | Iran closed the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌ జలసంధిని మూసేస్తున్నాం : ఇరాన్‌

Jul 12 2026 7:07 AM | Updated on Jul 12 2026 7:36 AM

Iran closed the Strait of Hormuz

టెహ్రాన్‌ : ఇరాన్–అమెరికా పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో గుర్తింపు లేని, అనధికారిక నౌకల రాకపోకలకు అనుమతి లేదని ఇరాన్ ముందునుంచే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా అనధికారికంగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. అనంతరం హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఈ పరిణామాల మధ్య, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. మూడో దఫా తమ భూభాగంపై అమెరికా దాడులకు పాల్పడిందని పేర్కొంటూ, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ, ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని వెల్లడించింది.

యుద్ధాన్ని ముగించేందుకు గత నెలలో కుదిరిన ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే చర్చలు హర్మూజ్ జలసంధి భద్రత లేకుండా ముందుకు సాగలేవని అమెరికా ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరాన్ కూడా స్పష్టమైన బహిరంగ ప్రకటన చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఓ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపామని, హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నామని వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు, వాటికి అమెరికా ప్రతిస్పందనల నేపథ్యంలో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. ఈ పరిస్థితులపై చర్చించేందుకు ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు శనివారం సమావేశమైన అనంతరం ఈ ప్రకటనలు వెలువడ్డాయి.

ఇదిలా ఉండగా, తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తూ, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందించిన ట్రంప్, తనపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement