పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు.
తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్‌లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

బ్యాక్ టు బ్యాక్ వార్నింగులు
ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్‌పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.
సోలేమానీ హత్యతో మొదలైన వైరం
2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
శాంతి చర్చలపైనా కఠిన వైఖరి
ఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్‌పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.


