న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. ‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడరన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్’ (డబ్ల్యూడీఎంఏంఏ) విడుదల చేసిన 2026 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత్ తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ జాబితాలో పొరుగుదేశమైన చైనాను వైమానిక దళం వరుసగా ఐదోసారి వెనక్కి నెట్టడం విశేషం.
అమెరికా, రష్యాల తర్వాత..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన వైమానిక దళాలు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, రష్యా ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటి తర్వాత అత్యుత్తమ సామర్థ్యంతో భారత వైమానిక దళం మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు మొత్తం ఆరుసార్లు భారత్ ఈ గౌరవాన్ని దక్కించుకోవడం గమనార్హం.
ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారంటే..?
డబ్ల్యూడీఎంఏంఏ సంస్థ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 103 దేశాలకు చెందిన 129 వైమానిక దళాల పరిధిలోని సుమారు 48,000 సైనిక విమానాల సామర్థ్యాన్ని విశ్లేషిస్తుంది. కేవలం విమానాల సంఖ్యను మాత్రమే కాకుండా.. వాటి రకాలు, సాంకేతిక పరిజ్ఞానం, లాజిస్టికల్ మద్దతు, ఆధునీకరణ, కార్యాచరణ సామర్థ్యాలను బట్టి ‘ట్రూ వాల్యూ రేటింగ్’ (టీవీఆర్) విధానంలో ఈ ర్యాంకులను కేటాయిస్తుంది.
భారత వాయుసేన అమ్ములపొదిలో..
నివేదిక ప్రకారం, భారత వైమానిక దళం వద్ద రక్షణ, రవాణా, శిక్షణకు ఉపయోగపడే సమతుల్య విమాన సముదాయం ఉంది. ప్రస్తుతం వాయుసేన వద్ద మొత్తం 1,716 విమానాలు ఉన్నాయి.
ఫైటర్ జెట్‌లు: ఏడు రకాలకు చెందిన 542 యుద్ధ విమానాలు ఉన్నాయి (దీనిలో 2025 సెప్టెంబరులో సేవలనుంచి తొలగించబడనున్న మిగ్-21 విమానాలు కూడా ఉన్నాయి).
హెలికాప్టర్లు: 222 ఎమ్ఐ-17 హెలికాప్టర్లు, 111 స్వదేశీ హెచ్‌ఏఎల్ ధ్రువ్ మరియు రుద్ర హెలికాప్టర్లతో కలిపి మొత్తం 498 హెలికాప్టర్లు ఉన్నాయి.
రవాణా, శిక్షణా విమానాలు: 282 రవాణా విమానాలు, 374 శిక్షణా విమానాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేక మిషన్ విమానాలు: గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు , నిఘా, గగనతలంలోనే ఇంధనాన్ని నింపే 20 ప్రత్యేక విమానాలు ఉన్నాయి.
టాప్-10 దేశాల రేటింగ్స్
1. అమెరికా - 242.9
2. రష్యా - 114.2
3. భారత్ - 69.4
4. చైనా - 63.8
5. జపాన్ - 58.1
6. ఇజ్రాయెల్ - 56.3
7. ఫ్రాన్స్ - 55.3
8. బ్రిటన్ - 55.3
9. దక్షిణ కొరియా - 53.4
9. ఇటలీ - 51.9


