ప్రపంచం నలుమూలల నుంచీ వేలాది మిస్సైల్స్ ముంచెత్తుతాయి
ట్రంప్ హెచ్చరిక
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్ భూతలంపై అమెరికా.. అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ బాంబులేస్తూ పశ్చిమాసియాలో రణజ్వాలల్ని కొనసాగిస్తుండగా శనివారం మాత్రం పరస్పర హెచ్చరికల పర్వానికి తెరలేపారు. తండ్రి మరణానికి కారణమైన ట్రంప్‌ను అంతమొందిస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞచేసిన కొన్ని గంటలకే ట్రంప్ సైతం దీటైన హెచ్చరిక చేశారు. తనను చంపితే ప్రపంచపటంలో ఇరాన్ లేకుండా చేస్తామని, దారుణ వినాశనం సృష్టించేలా 1,000 క్షిపణులు దాడికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్ ప్రభుత్వం గనక నన్ను చంపితే మరుక్షణమే ఇరాన్‌ను భూస్థాపితం చేసేందుకు 1,000 క్షిపణులు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. అవి వినాశనం సృష్టించాక మిగతా భూమిని మరుభూమిగా మార్చేందుకు వేలాదిగా మిస్సైళ్లు వరసబెట్టి విరుచుకుపడతాయి. ఒకవేళ నన్ను చంపితే ఇరాన్‌పై ఎంతటి స్థాయిలో దాడిచేయాలో మా సైన్యానికి సమగ్రస్థాయిలో ఆదేశాలు ఇప్పటికే ఇచ్చేశా. ఇరాన్‌లో అంగుళం స్థలం కూడా వదలకుండా ఏడాది పొడవునా దాడులు చేయాలని గతంలోనే తగు ఆజ్ఞలు జారీచేశా’’అని ట్రంప్ హెచ్చరించారు.
ప్రతీకారం తీర్చుకుంటాం: మొజ్తాబా
అంతకుముందు శుక్రవారం దివంగత ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ అధికార వార్తఛానల్‌లో మొజ్తాబా ఖమేనీ సందేశాన్ని ప్రసారంచేశారు. ‘‘ట్రంప్‌ను చంపాలనేది మా దేశ సంకల్పం. ఈ సంకల్పాన్ని సాధించి తీరతాం. అమరత్వం పొందిన మా నేత రక్తాన్ని చిందేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ఘోరాలకు పాల్పడిన వాళ్లను వదలిపెట్టం. రెండు యుద్దాల్లో మా వాళ్లు అమరులయ్యేలా చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. నేరాలు చేసిన హంతకుల అంతుచూస్తాం’’అని మొజ్తాబా అన్నారు. హార్మూజ్‌ను తమ గుప్పిట పట్టామని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా సీనియర్ ఉన్నతాధికారి తప్పుబట్టారు.
ఇరాన్ తక్షణం హార్మూజ్‌ను తెరచి ఉంచామని ప్రకటన చేయాలని హెచ్చరించారు. హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు ఎలాంటి హానీ తలపెట్టొద్దని డిమాండ్‌చేశారు. గత రెండ్రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 17 మంది చనిపోయారు. 115 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు. మరోవైపు మధ్యవర్తి ఒమన్ దేశంతో చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌అరాఘ్చీ సిద్ధమయ్యారు. తమ క్రూడ్, ఫ్యూయల్‌ను విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధించడం సబబుగా లేదు అని అరాఘ్చీ ఆగ్రహం వ్యక్తంచేశారు.


