ఐరన్‌ లంగ్‌ జీవితం ముగిసింది! | Last American polio survivor in an iron lung dies at 78 | Sakshi
Sakshi News home page

ఐరన్‌ లంగ్‌ జీవితం ముగిసింది!

Jul 12 2026 4:08 AM | Updated on Jul 12 2026 4:08 AM

Last American polio survivor in an iron lung dies at 78

అమెరికాలో చిట్టచివరి పోలియో బాధితురాలి మృతి

జీవితాంతం ఉక్కు ఊపిరితిత్తులతోనే శ్వాస

అయినా తగ్గని ఉత్సాహం

నెట్‌లోనే భర్తను వెతుక్కుంది.

మరణవార్త ముందుగానే వెబ్‌సైట్‌లో పోస్ట్‌

ఒక్లహోమా సిటీ: అమెరికాలో పోలియో మహమ్మారి చిట్టచివరి బాధితురాలు మార్థా అన్‌ లిలార్డ్‌ (78) ప్రశాంతంగా కళ్లు మూసింది. ఐదేళ్ల వయసులోనే వ్యాధికి గురై ఇరవై ఏళ్ల మించి బతకదని వైద్యులు పెదవి విరిచేసినా... లిలార్డ్‌ ఉక్కు ఊపిరితిత్తుల తో జీవితం మొత్తాన్ని గడిపేసిన వ్యక్తిగా మిగిలిపోయింది. పోలియో కారణంగా ఊపిరితిత్తుల కండరాలు పని చేయకపోవడంతో చిన్నప్పటి నుంచి భారీ యంత్రం (ఐరన్‌ లంగ్‌) సాయంతోనే ఊపిరి తీసుకునేది. 

కుడి చేయి పక్షవాతం బారిన పడినా, ఎడమ చేయిని నడుము వద్ద కొద్దిగా మాత్రమే కదిలించగలిగిన లిలార్డ్‌లో ఉత్సాహానికి మాత్రం కొదవ ఉండేది కాదని, సొంతంగా వంట చేసుకోవడమే కాకుండా... నెట్‌ బ్రౌజింగ్‌ చేసేదని, కవితలు రాయడమే కాకుండా.. తన మరణం తాలూకూ వార్తను కూడా ముందుగానే రాసి వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిందని చెల్లి సిండీ మెక్‌ వీ తెలిపారు. 

రెండు సార్లు కోవిడ్‌–19 బారిన పడటంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా తగ్గిపోయి ఐదేళ్లుగా ఇంటికే పరిమితమైంది. రెండేళ్లుగా రోజు మొత్తం ఐరన్‌ లంగ్‌లోనే గడిపిన లిలార్డ్‌ ఆఖరకు అమెరికాలోని ఓక్లహోమా సిటీలో జూన్‌ 26న తుదిశ్వాస విడిచారు. దీంతో ఐరన్‌ లంగ్‌తో జీవించిన చిట్టచివరి వ్యక్తిగా లిలార్డ్‌ మిగిలిపోయారు. రెండేళ్ల క్రితమే పాల్‌ అలెగ్జాండర్‌ అనే మరో పోలియో పీడితుడు కూడా మరణించడంతో చిట్టచివరి బాధితురాలిగా లిలార్డ్‌ మిగిలిపోయారు.

‘‘లిల్లార్డ్‌ 20 ఏళ్ల వయసు దాటదని డాక్టర్లు చెప్పారు. కానీ... బతకాలన్న తపన, ఆమె జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు.. ఆస్వాదించేలా చేసింది.’’అని లిలార్డ్‌ చెల్లి సిండీ మెక్‌వీ తెలిపారు. ఐరన్‌ లంగ్‌ అనేది ఓ భారీ పరికరం. సిలిండర్‌ ఆకారంలో ఉంటుంది. మనిషి దాంట్లో పడుకుని ఉంటే తల మాత్రం బయటకు వచ్చి ఉంటుంది. ఇలాంటి ఏర్పాటుతోనే లిలార్డ్‌ తన జీవితం మొత్తం గడిపింది. 

చిన్నప్పుడు రెండు గంటలపాటు పాఠశాలకు వెళ్లేదని, మిగిలిన సమయంలో ట్యూటర్లు ఇంటికొచ్చి పాఠాలు చెప్పేవారని సోదరి వివరించారు. ఫోన్‌ల ద్వారానే షానీ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేసినట్లు తెలిపారు. విహారయాత్రలకు వెళ్లాలంటే ప్రత్యేకమైన వాహనం వాడేవారని ఐరన్‌ లంగ్‌ యంత్రం పట్టేంత తలుపులు ఉన్నాయా? లేదా? అని విచారించుకున్న తరువాతే తండ్రి బయటకు తీసుకెళ్లే వారని వివరించింది. లిలార్డ్‌ కొంతకా>లం డ్రైవింగ్‌ కూడా చేయడం ఆమెలోని పట్టుదలకు ప్రతీకలుగా చెప్పవచ్చు.

ఇంటర్నెట్‌ ప్రపంచంలో...
లిలార్డ్‌కు ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా... జీవితంలో కుతూహలాన్ని మాత్రం కోల్పోలేదు. అందుకే పోలియో గురించి మాత్రమే కాకుండా.. ప్రపంచ సంగతులను కూడా ఆమె ఇంటరెŠన్‌ట్‌ ద్వారా తెలుసుకునే వారు. 2001 సెప్టెంబర్‌ 11 ఉగ్రదాడుల తర్వాత లిలార్డ్‌ కాబోయే భర్త బహాసల్హ్‌ కూడా ఇంటర్నెట్‌ చాట్‌రూమ్‌లోనే పరిచయమయ్యారు. ఇరవై ఏళ్లకు పైగా ఆన్‌లైన్‌లో నడిచిన ప్రేమ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లితో సంపూర్ణమైంది. 

ఈజిప్టుకు చెందిన బహాసల్హ్‌ అమెరికా వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వీరిద్దరి ప్రేమ ఆన్‌లైన్‌కే పరిమితమైంది. ఆమె కవితలు రాసింది, పాటలు రాసింది. తన చావు వార్తను కూడా కూడా ముందుగానే రాసి, ఫ్యూనరల్‌ హోమ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. పోలియో వ్యాధి ఒక్క అమెరికాను మాత్రమే కాదు... ప్రపంచాన్ని వణికించిన మహా వ్యాధి ఏటా లక్షల మంది పిల్లల్ని పక్షవాతం బారిన పడేసేది. 1955లో టీకా అందుబాటులోకి రావడంతో ఇది క్రమేపీ తగ్గుముఖం పట్టింది. పోలియోతో కొందరి కాళ్లు చచ్చుబడితే మరికొందరికి ఇతర శరీర భాగాలు పని చేయకుండా పోతాయన్నది తెలిసిన విషయమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement