తుదిశ్వాస వరకు విశ్రాంతి నెరుగని కళాకారుడు
సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారుడు, గుజరాత్‌లో ఏర్పాటైన ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం రూపకర్త అయిన రామ్ సుతార్ కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఉన్న తన నివాసంలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు తెలిపారు. వందేళ్ల వయస్సున్న రామ్ సుతార్ గత కొంత కాలంగా వయో సంబంధ రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నారన్నారు.
‘మా తండ్రి శ్రీ రామ్ వంజీ సుతార్ డిసెంబర్ 17వ తేదీ రాత్రి మా నివాసంలో తుదిశ్వాస విడిచారని తెలుపుటకు విచారిస్తున్నాం’అని ఆయన కుమారుడు అనిల్ సుతార్ గురువారం ఒక ప్రకటన చేశారు. తండ్రితోపాటు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో అనిల్ కూడా పాలుపంచుకున్నారు. మహారాష్ట్రలోని ధులె జిల్లా గొండూర్ గ్రామంలో 1925 ఫిబ్రవరి 19వ తేదీన రామ్ సుతార్ జని్మంచారు. చిన్ననాటి నుంచే శిల్పకళపై ఆయన ఆసక్తి కనబరిచారు.
ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యారి్థగా చూపిన ప్రతిభకు బంగారు పతకం సాధించారు. పార్లమెంట్ ఆవరణలో ప్రతిష్టించిన ధ్యానముద్రలో ఉన్న మహాత్ముడు, మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో అశ్వంపై ఛత్రపతి శివాజీ విగ్రహాలు ఆయన రూపొందించిన అత్యత్తుమ కళాఖండాల్లో కొన్ని. గుజరాత్‌లో నర్మదా తీరంలో కేవడియా వద్ద దేశ ప్రప్రథమ ఉపప్రధాని, హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం కూడా రామ్ సుతార్ ఘనతే.
182 మీటర్ల ఎత్తయిన ఐక్యతా శిల్పం రూపకర్తగా ఈయన పేరు ప్రపంచదేశాల్లో మారుమోగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ విగ్రహంతో భారీ స్థాయి స్మారక విగ్రహాల రూపకల్పనలో ఆయన ప్రతిష్టను, పేరును సుస్థిరం చేసింది. రామ్ సుతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ముంబైలోని ఇందుమిల్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మెమోరియల్ ఒకటి. మరికొద్ది రోజుల్లో ఆవిష్కరించనున్న అసోంలోని గౌహటిలో గోపీనాథ్ బొర్డొలోయ్ విగ్రహం కూడా ఈయన చేతుల్లో జీవం పోసుకున్నదే కావడం విశేషం.
ఇప్పటికే అసోంలోని జోర్హాత్‌లో ఉన్న లచిత్ బర్ఫుకాన్ భారీ విగ్రహం సైతం సుతార్ రూపొంచిందిందే కావడం గమనార్హం. తుదిశ్వాస వరకు దాదాపు ఏడు దశాబ్దాలపాటు రాతి, కాంస్య శిల్పాలకు ప్రాణం పోసే పనిలోనే నిమగ్నమై ఉన్న రామ్ సుతార్‌కు స్టాచ్యూ మ్యాన్ అనే పేరు స్థిరపడిపోయింది. కేంద్ర ప్రభుత్వం 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మ భూషణ్ పురస్కారాలతో ఆయన్ను గౌరవించింది. ఇటీవల మహారాష్ట్ర అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ పురస్కార్ కూడా రామ్ సుతార్ అందుకున్నారు. రామ్ సుతార్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


