బెంగాల్ సీఎం మమత ప్రకటన
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అమలవుతున్న గ్రామీణ ఉపాధి పథకం ‘కర్మశ్రీ’కి మహాత్మాగాంధీ పేరు పెడతామని సీఎం మమత ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు ను వికసిత్–భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ)(వీబీ–జీ రామ్ జీ)అంటూ మారుస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు.
కొన్ని రాజ కీయ పార్టీలు జాతిపిత మహాత్మాగాంధీకి కూడా గౌరవం ఇవ్వడం లేదంటూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురు వారం కోల్‌కతాలో వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో జరిగిన కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఈజీఏ కార్యక్రమం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించాలని నిర్ణయించడం చూస్తే తనకు బాధ కలుగుతోందన్నారు. జాతి నేతలను వాళ్లు (బీజేపీ)గౌరవించలేకుంటే, మేం ఆ పని చేస్తాం. కర్మశ్రీ పథకాన్ని ఇకపై గాంధీజీ పేరుతో పిల్చుకుంటామన్నారు. కర్మశ్రీ పథకం కింద బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల వారికి 75 రోజుల పనిదినాలను కల్పిస్తారు.


