అమెరికాకు చెందిన బ్లూబర్డ్–6 కమ్యూనికేషన్
ఉపగ్రహాన్ని పంపేందుకు ఏర్పాట్లు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 24న ఉదయం 8.54 గంటలకు ఎల్‌వీఎం3–ఎం6 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఏటీఎస్ సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన 6,500 కిలోల బ్లూబర్డ్–6 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.
రెండో అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులను పూర్తి చేసి ప్రయోగ వేదిక మీదకు తరలించారు. ముందుగా ఈ నెల 15న, ఆ తరువాత 21న ప్రయోగం జరపాలని భావించగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న ముహూర్తం కుదరడంతో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించాలనుకునే వారు గురువారం నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. షార్ కేంద్రం నుంచి ఇది 104వ ప్రయోగం కాగా ఉపగ్రహ ప్రయోగాల్లో వందవది కావడం గమనార్హం.


