98 శాతానికిపైగా భారతీయ ఉత్పత్తులపై సున్నా టారిఫ్‌లు
ఒమన్ ఖర్జూరం, మార్బుల్స్, పెట్రో కెమికల్స్‌పై సుంకాలు తగ్గించనున్న భారత్
స్వదేశీ పరిశ్రమలు, రైతుల సంక్షేమం కోసం కొన్ని ఉత్పత్తులపై మినహాయింపులు ఇవ్వని ప్రభుత్వం
భారతీయ వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పించేందుకు అంగీకారం
మస్కట్: భారత్, ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు గురువారం సంతకాలు చేశాయి. ఫలితంగా 98 శాతానికిపైగా భారతీయ ఉత్పత్తులపై ఒమన్‌లో సుంకాలు సున్నాకు చేరుకోనున్నాయి. ఎలాంటి సుంకాలు లేకుండానే భారతీయ వ్రస్తాలు, వ్యవసాయ, తోలు సహా పలు ఉత్పత్తులను ఒమన్‌లో విక్రయించుకోవచ్చు. అదేసమయంలో ఒమన్ నుంచి దిగుమతి అయ్యే ఖర్జూరం, మార్బుల్స్, పెట్రో కెమికల్స్ సహా పలు ఉత్పత్తులపై సుంకాలను భారత్ తగ్గించనుంది.
ఈ ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం సుంకాలు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఒమన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం సానుకూల పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎఫ్‌టీఏపై భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి ఖాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసుఫ్ సంతకాలు చేశారు. దీన్ని అధికారికంగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)గా పిలుస్తున్నారు.
ఒప్పందంలో ముఖ్యాంశాలు
→ భారతదేశం ఒమన్‌కు చేసే ఎగుమతుల్లో 99.38 శాతం ఉత్పత్తులపై జీరో–డ్యూటీ అమల్లోకి రానుంది.
→ భారతీయ సంప్రదాయ ఔషధాలపైనా ఒమన్ సున్నా సుంకాలు విధించబోతోంది. దీనివల్ల ఇండియాలోని ఆయుష్, వెల్‌నెస్ రంగాలకు లబ్ధి చేకూరనుంది.
→ భారత్ నుంచి ఎగుమతి అయ్యే బంగారు ఆభరణాలు, తోలు, పాదరక్షలు, క్రీడా పరికరాలు, సామగ్రి, ప్లాస్టిక్, ఫరి్నచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మా, వైద్య పరికరాలు, ఆటోమొబైల్ పరికరాలపై ఎలాంటి పన్ను ఉండదు.
→ కంప్యూటర్ సంబంధిత సేవలు, వ్యాపార, వృత్తి సేవలు, ఆడియో–విజువల్, పరిశోధన–అభివృద్ధి, విద్య, ఆరోగ్య సేవలపైనా ఒమన్ ప్రభుత్వం సుంకాలు తగ్గించబోతోంది. ఒమన్ 12.52 బిలియన్ డాలర్ల విలువైన సేవలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఇండియా వాటా కేవలం 5.31 శాతంగా ఉంది. ఎఫ్‌టీఏతో ఈ వాటా మరింత పెరగనుంది.
→ భారతీయ వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పిచేందుకు ఒమన్ ముందుకొచ్చింది. అకౌంటెన్సీ, టాక్సేషన్, ఆర్కిటెక్చర్, మెడికల్ సంబంధిత రంగాల్లో భారతీయులకు సులువుగా ఉద్యోగాలు లభిస్తాయి.
→ అంతేకాకుండా భారతీయ కంపెనీల నుంచి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐ)కు ఒమన్ అనుమతి ఇవ్వనుంది.
→ ఒమన్ నుంచి దిగుమతి అయ్యే వాటిలో 94.81 శాతం ఉత్పత్తులపై భారత ప్రభుత్వం సుంకాలు రద్దు చేయనుంది.
→ భారతీయ పరిశ్రమలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం లేదు. ఒమన్ నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బర్, పొగాకు, బంగారం, వెండి ఆభరణాలు, పాదరక్షలు, క్రీడాసామగ్రి, కొన్ని రకాల లోహాలపై ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. వీటిని ఒప్పందంలో చేర్చలేదు.
కీలక మిత్రదేశం ఒమన్
→ 2006 తర్వాత ఒమన్ ప్రభుత్వం మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. అలాగే గత ఆరు నెలల్లో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో ఇది రెండోది. ఆరు నెలల క్రితం యూకేతో కలిసి ఎఫ్‌టీఏపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.
→ ఇండియా, ఒమన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2024–25లో 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
→ గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి ఒమన్. అంతేకాకుండా భారతదేశ సరుకులు, సేవలు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలకు చేరడానికి ఒమన్ ఒక ముఖద్వారంగా ఉపయోగపడుతోంది.
→ ఒమన్‌లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. 300 ఏళ్ల క్రితమే స్థిరపడిన భారతీయ వ్యాపార కుటుంబాలు కూడా ఉన్నాయి.
→ ఒమన్‌లో 6 వేలకుపైగా భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
→ ఒమన్‌లోని భారతీయులు ప్రతిఏటా 2 బిలియన్ డాలర్లను భారత్‌కు పంపిస్తున్నారు.
→ 2000 ఏప్రిల్ నుంచి 2025 సెపె్టంబర్ మధ్య ఒమన్ నుంచి భారత్‌కు 615.54 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.


