ప్రపంచంలో అత్యధిక యూజర్లు భారతీయులే
చాట్‌జీపీటీకి 14.5 కోట్ల వినియోగదారులు
జెమినైకి 10.5 కోట్ల నెలవారీ యూజర్లు
‘బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్’ నివేదిక
ఏఐ యాప్‌లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్ యూజర్–బేస్ మార్కెట్‌గా అవతరించిందని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్’ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ యాప్‌లకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రోజువారీ, నెలసరి యూజర్లు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా చాట్ జీపీటీకి 14.5 కోట్ల నెలవారీ వినియోగదారులు ఉంటే తరువాతి స్థానంలో 10.5 కోట్ల మందితో జెమినై ఉంది.
ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’, గూగుల్‌కు చెందిన ‘జెమినై’, పెర్‌ప్లెక్సిటీ వంటి యాప్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజువారీ, నెలవారీ యాక్టివ్ యూజర్లు భారత్‌లో ఉన్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.

2025 నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్‌లలో.. జెమినైకి 31 శాతం, పెర్‌ప్లెక్సిటీలను 38 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోని మొత్తం వాట్సాప్ వినియోగదారుల్లో మనవాళ్లు 32 శాతం కాగా, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లలో భారతీయులు 31 శాతం కావడం విశేషం.-సాక్షి స్పెషల్ డెస్క్


