నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆఖరి టి20 మ్యాచ్
టీమిండియా గెలిస్తే సిరీస్ హస్తగతం
సఫారీ జట్టు నెగ్గితే సిరీస్ సమం
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
అహ్మదాబాద్: సిరీస్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు శుక్రవారం దక్షిణాఫ్రికాతో చివరి టి20 మ్యాచ్ బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా రెండు విజయాలు సాధించగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గింది. మరో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ 2–1తో ముందంజలో ఉంది. చివరి మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా... సుదీర్ఘ పర్యటనను విజయంతో ముగించి సిరీస్‌ను సమం చేయాలని సఫారీలు చూస్తున్నారు.
ఈ టూర్‌లో భాగంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ నెగ్గగా... టీమిండియా వన్డే సిరీస్ సొతం చేసుకుంది. ఇప్పుడిక టి20 విజేతను తేల్చే మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన భారత వైస్ కెపె్టన్ శుబ్‌మన్ గిల్... జట్టుతో పాటు అహ్మదాబాద్ చేరుకున్నాడు. దీంతో తుది జట్టులో సామ్సన్‌కు చోటు దక్కుతుందా లేక గిల్‌ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సఫారీ జట్టు సిరీస్ సమం చేసి సగర్వంగా స్వదేశానికి తిరిగి వేళ్లాలని చూస్తోంది. అహ్మదాబాద్ పిచ్ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయమే!
సూర్యకుమార్ సత్తా చాటేనా!
స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. ఈ ఏడాది ఆడిన 18 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ 14.20 సగటుతో 213 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తనకు అలవాటైన మూడో స్థానంలో బరిలోకి దిగి భారీ ఇన్నింగ్స్‌తో అనుమానాలను పటాపంచలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న టి20 వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియా మరో ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో... అటు ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇటు సిరీస్ చేజిక్కించుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. అతడు కాసేపు క్రీజులో నిలిస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ల గణాంకాలు తారుమారు కావడం ఖాయమే.
ఇక మరో ఓపెనర్‌గా గిల్, సామ్సన్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. హైదరాబాద్ ప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ నిలకడ కొనసాగిస్తున్నా... బ్యాటింగ్‌లో మరింత వేగం పెంచాల్సిన అవసరముంది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా భారీ షాట్‌లు ఆడగల సమర్థులే. అయితే వీరంతా కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. బుమ్రా రాకతో బౌలింగ్ విభాగం పటిష్టమవగా... మరోసారి వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు.
మార్క్‌రమ్‌పై ఆశలు
టెస్టు సిరీస్ విజయంతో ఈ పర్యటనను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు టి20 సిరీస్‌ను సమం చేయడంతో... ముగించాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో నైపుణ్యానికి కొదవ లేకపోయినా... వారంతా సమష్టిగా రాణించలేకపోవడమే సఫారీ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ లయ దొరకబుచ్చుకోలేక ఇబ్బంది పడుతుంటే... మరో ఓపెనర్ డికాక్ నిలకడలేమితో సతమతమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో డికాక్‌తో కలిసి మార్క్‌రమ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించవచ్చు. భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉన్న డికాక్, మార్క్‌రమ్ రాణిస్తే సఫారీ జట్టుకు తిరుగుండదు. బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, కార్బిన్ బాష్ రూపంలో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో యాన్సెన్, ఎన్‌గిడి, బాష్, బార్ట్‌మన్ కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, గిల్/సామ్సన్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా/వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/కేశవ్, ఎన్‌గిడి, బార్ట్‌మన్.


