రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ విభాగంలో రజతం గెలిచిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్
సాక్షి, హైదరాబాద్: ఎన్‌టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రెండు పతకాలతో మెరిశాడు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ధీరజ్... టీమ్ విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో గురువారం ముగిసిన ఈ పోటీల్లోపురుషుల రికర్వ్ వ్యక్తిగత ఫైనల్లో ధీరజ్ 6–0తో పార్థ్ సుశాంత్ సాలుంకే (మహారాష్ట్ర)పై గెలిచి జాతీయ చాంపియన్‌గా అవతరించాడు.
టీమ్ విభాగంలో ధీరజ్, రాహుల్, సుఖ్‌చెయిన్ సింగ్‌లతో కూడిన సర్వీసెస్ జట్టు ఫైనల్లో అభ్యుదయ్, పార్థ్ సాలుంకే, సాహిల్‌లతో కూడిన మహారాష్ట్ర జట్టు చేతిలో ఓడిపోయింది. గౌరవ్, యశ్‌దీప్, పవన్‌లతో కూడిన రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) జట్టుకు కాంస్య పతకం దక్కింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడు అర్జున్ ముండా ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్ నిర్వహణ కోసం భారత్ బిడ్ దాఖలు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు నిర్వహించేందుకు ముందుకొచ్చే క్రీడా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.రాజు, జనరల్ సెక్రటరీ అరవింద్, ఆర్చరీ డెవలప్‌మెంట్ సభ్యుడు పుట్టా శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ సంఘానికి చెందిన అశ్విన్ రావు, బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ గుస్తీ నోరియా, కమిటీ సభ్యుడు మర్రి ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.


