తైపీ ఓపెన్ వరల్డ్ సిరీస్ ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల
అండర్–21 కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత చాంపియన్‌గా అవతరించింది. చైనీస్ తైపీలోని తావోయువాన్ సిటీలో జరిగిన ఈ టోరీ్నలో చికిత ఫైనల్లో 148–141 పాయింట్ల తేడాతో జిట్‌మున్ ఖెమనిత్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది.
సెమీఫైనల్లో చికిత 147–145తో యోన్‌సియో కాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 149–138తో సియోయూన్ కాంగ్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది. మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 149–143తో సో చేవన్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది.
పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ కూడా కాంస్యం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్ వర్మ 148–146తో మార్కో బ్రునో (ఇటలీ)పై గెలిచాడు. మహిళల రికర్వ్ అండర్–21 కాంస్య పతక మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కొండపావులూరి యుక్తశ్రీ 5–6తో షు యాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.


