Year Ender 2025: వైభవ్‌, దివ్య, శీతల్‌.. మరెన్నో విజయాలు | Year Ender 2025: Viabhav Divya Sheetal Indian Successful players | Sakshi
Sakshi News home page

Year Ender 2025: వైభవ్‌, దివ్య, శీతల్‌.. మరెన్నో విజయాలు

Dec 18 2025 7:38 PM | Updated on Dec 18 2025 8:10 PM

Year Ender 2025: Viabhav Divya Sheetal Indian Successful players

భారత క్రీడా‌ రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములేపారు. ఐపీఎల్‌-2025లో పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీతో పాటు ఆయుశ్‌ మాత్రే సంచలన ప్రదర్శనలు నమోదు చేయగా.. చెస్‌లో దివ్యా దేశ్‌ముఖ్‌ మహిళల వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచి సత్తా చాటింది. వీరితో పాటు 2025లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు, వారి విజయాలను నెమరు వేసుకుందాం!

దూసుకొచ్చిన యువ కెరటం
భారత క్రికెట్‌లో నయా సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). హర్యానాకు చెందిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఐపీఎల్‌ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ అతడిని ఏకంగా 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ క్రమంలో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌లో శతక్కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా యూత్‌ వన్డే, టెస్టుల్లో సెంచరీలతో చెలరేగాడు.

ఆయుశ్‌ మాత్రే
మహారాష్ట్రకు చెందిన ఆయుశ్‌ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్‌ మాదిరే సెంచరీ బాదాలని చూసిన ఆయుశ్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లో  48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు.

ఇక వైభవ్‌ బ్యాటర్‌గా భారత అండర్‌-19 జట్టు తరఫున సత్తా చాటుతుండగా.. పదిహేడేళ్ల ఆయుశ్‌ అతడికి ఓపెనింగ్‌ జోడీగా ఉంటూనే కెప్టెన్‌గానూ కీలక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు.

దివ్య దేశ్‌ముఖ్‌
భారత చెస్‌ రంగంలో సరికొత్త సంచలన దివ్య దేశ్‌ముఖ్‌. ఫిడే మహిళల వరల్డ్‌కప్‌-2025లో ఈ మహారాష్ట్ర అమ్మాయి అద్భుత విజయం సాధించింది. సీనియర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపిని ఓడించి టైటిల్‌ కైవసం చేసుకుంది.

తద్వారా అత్యంత పిన్నవయసులోనే (19 ఏళ్లు) ఈ ఘనత సాధించిన చెస్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందడానికి ముందే ఈ ఫీట్‌ అందుకున్న ప్లేయర్‌గానూ రికార్డు సాధించింది. వరల్డ్‌కప్‌ విజయంతోనే దివ్యకు గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కింది. ఓవరాల్‌గా ఇండియాలో 88వ, మహిళలలో 44వ గ్రాండ్‌ మాస్టర్‌గా దివ్య నిలిచింది.

ఇక వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌-2026​కు కూడా దివ్య దేశ్‌ముఖ్‌ అర్హత సాధించింది.

డి. గుకేశ్‌
గతేడాది వరల్డ్‌చెస్‌ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌ ఈ ఏడాదిని ఫిడే గ్రాండ్‌ స్విస్‌-2025లో విజయం సాధించాడు. అంతేకాదు.. తొలిసారిగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా ఫిడే క్లాసికల్‌ రేటింగ్‌ లిస్టులో వరల్డ్‌ నంబర్‌ 3గా ఈ చెన్నై చిన్నోడు నిలిచాడు.  

ఆర్‌. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్‌బాబు
చెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లైన ఈ చెస్‌ గ్రాండ్‌మాస్టర్లు ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్‌ చెస్‌-2025లో గుకేశ్‌ను టై బ్రేకర్‌లో ఓడించి టైటిల్‌ సాధించాడు.

తద్వారా ఫిడే రేటింగ్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్‌ నంబర్‌ 8 ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నాడు.

ఇక వైశాలి రమేశ్‌ బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్‌ స్విస్‌ 2025 టైటిల్‌ గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్‌ ప్లేయర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో వుమెన్స్‌ క్యాండిడేట్స్‌కు అర్హత సాధించింది. ఆమె కంటే ముందు హంపి, దివ్య ఈ క్వాలిఫై అయ్యారు.

టాటా స్టీల్‌ చాలెంజర్స్‌లోనూ సత్తా చాటిన వైశాలి రమేశ్‌బాబు మహిళల రేటింగ్స్‌లో ఇండియా నంబర్‌ 2గా నిలిచింది. వీరితో పాటు  తెలంగాణ స్టార్‌ అర్జున్‌ ఇరిగేసి కూడా ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.

మరెన్నో విజయాలు
ఫ్రీస్టైల్‌ చెస్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌నే ఓడించి నాకౌట్‌కు చేరాడు. అంతేకాదు.. రాపిడ్‌ రౌండ్‌ రాబిన్‌ స్టేజ్‌లోనూ మరోసారి అతడికి ఓటమిని రుచి చూపించాడు. అయితే, క్వార్టర్‌ఫైనల్స్‌లో విన్సెంట్‌ కెమెర్‌ చేతిలో ఓడిపోవడంతో అర్జున్‌ సెమీస్‌ చేరే అవకాశాన్ని కోల్పోయాడు.

ఇక ఇతరులలో పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి ఈ ఏడాది వరల్డ్‌ ఆర్చరీ పారా చాంపియన్‌షిప్స్‌ గెలిచింది. మరోవైపు.. షూటర్‌ సామ్రాట్‌ రాణా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్స్‌షిప్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ విభాగంలో టైటిల్‌ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.

వీరితో పాటు పారా అథ్లెట్‌ సుమిత్‌ ఆంటిల్‌, అథ్లెట్‌ అనిమేశ్‌ కుజూర్‌ చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. మరోవైపు.. టీమ్‌ ఈవెంట్లలో భారత్‌ తొలిసారి మహిళల క్రికెట్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలవగా.. ఖో-ఖో పురుషుల, మహిళలు.. కబడ్డీ పురుషులు, మహిళా జట్లు చాంపియన్లుగా నిలిచి సత్తా చాటాయి. మహిళల అంధుల క్రికెట్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచింది.  

చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వ‌ర‌కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement