ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ విధ్వంసకర శతకం.. వీడియో | SMAT 2025 Final Ishan Kishan Slams 101 Kushagra Shines Vs HAR | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ విధ్వంసకర శతకం.. కుశాగ్రా ధనాధన్‌

Dec 18 2025 6:19 PM | Updated on Dec 18 2025 6:31 PM

SMAT 2025 Final Ishan Kishan Slams 101 Kushagra Shines Vs HAR

శతక్కొట్టిన ఇషాన్‌ కిషన్‌ (PC: BCCI)

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఎలైట్‌-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్‌తో ఈ సీజన్‌ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో హర్యానాతో టైటిల్‌ పోరులో టాస్‌ ఓడిన జార్ఖండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

ఓపెనర్లలో విరాట్‌ సింగ్‌ (2) విఫలం కాగా.. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.

శతక్కొట్టిన ఇషాన్‌ కిషన్‌.. కుశాగ్రా ధనాధన్‌
మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌ కిషన్‌ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

మరోవైపు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు.

అనుకుల్‌, రాబిన్‌ మింజ్‌ ధనాధన్‌
ఇషాన్‌ కిషన్‌, కుమార్‌ కుశాగ్రాకు తోడు అనుకుల్‌ రాయ్‌, రాబిన్‌ మింజ్‌ ధనాధన్‌ దంచికొట్టారు. అనుకుల్‌ రాయ్‌ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. రాబిన్‌ మింజ్‌ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.

ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్‌ కాంబోజ్‌, సుమిత్‌ కుమార్‌, సమంత్‌ జేఖర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement