అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(45), జోఫ్రా ఆర్చర్(30) ఉన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 45 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇంగ్లండ్ జట్టు ఇంకా 158 పరుగుల వెనకంజలో ఉంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్టోక్స్, ఆర్చర్‌తో పాటు హ్యారీ బ్రూక్ (45), బెన్ డకెట్ (29) ఫర్వాలేదన్పించారు. వైస్ కెప్టెన్ పోప్(3), క్రాలీ(9), రూట్(19) తీవ్ర నిరాశపరిచారు.
ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. లియోన్, బోలాండ్ తలా రెండు వికెట్లు సాధించారు. మరో వికెట్ గ్రీన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతకుముందు 326/8 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ 371 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (143 బంతుల్లో 106; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా..ఖవాజా(82), స్టార్క్(54) రాణించారు.
డీఆర్ఎస్ వివాదం..
కాగా ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ వివాదం చోటు చేసుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేస్తుండగా బంతి స్పష్టంగా బ్యాట్‌కు తాకినప్పటికి.. స్నికోమీటర్ సాంకేతిక లోపం వల్ల స్పైక్ రాలేదు. ఇంగ్లండ్ రివ్యూ తీసుకున్నప్పటికి స్నికోమీటర్‌లో స్పైక్ చూపించకపోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఐసీసీ స్పందించింది. సాంకేతిక అంగీకరిస్తూ.. ఇంగ్లండ్ కోల్పోయిన రివ్యూను తిరిగి ఇచ్చింది


