యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌తో ఆసీస్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ పునరాగమం చేస్తున్నట్లు వెల్లడించింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చినట్లు తెలిపింది.
2-0తో ఆధిక్యంలో
కాగా గాయం నుంచి కోలుకునే క్రమంలో.. ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా కమిన్స్ (Pat Cummins) చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. కమిన్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. వరుస విజయాలు అందుకున్నాడు.
ఫలితంగా ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పెర్త్ టెస్టులో నాథన్ లియోన్‌ను ఆడించిన యాజమాన్యం.. బ్రిస్బేన్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టు నుంచి తప్పించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు బ్రెండన్ డాగట్ (Brendan Doggett ) మెరుగ్గా రాణించగా.. మైకేల్ నెసర్ (Michael Neser) రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
నెసర్, డాగట్‌లపై వేటు.. ఖవాజాకు షాక్
అయితే, మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి రాగా.. సెలక్టర్లు ఈసారి నాథన్ లియోన్‌కు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నెసర్, డాగట్‌లపై వేటు పడింది. పిచ్ స్వభావం దృష్ట్యానే నాథన్ కోసం నెసర్‌ను అనూహ్య రీతిలో పక్కన పెట్టారా అనే చర్చ నడుస్తోంది.
అదే విధంగా.. వెన్నునొప్పి వల్ల రెండో టెస్టుకు దూరమైన ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను కూడా మేనేజ్‌మెంట్ మరోసారి పక్కనపెట్టింది.
ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- జేక్ వెదరాల్డ్ రాణిస్తుండటంతో ఖవాజాకు మొండిచేయి చూపింది. కాగా డిసెంబరు 17 నుంచి ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్ వేదిక.
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టు
ట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో జోష్ టంగ్
ఆసీస్ జరిగే యాషెస్ సిరీస్ మూడో టెస్టులో పాల్గొనే ఇంగ్లండ్ తుది జట్టును సోమవారమే ప్రకటించారు. పేసర్ గుస్ అట్కిన్‌సన్ స్థానంలో మరో బౌలర్ జోష్ టంగ్ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది.
భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన జోష్ టంగ్ 19 వికెట్లతో అదరగొట్టాడు. టంగ్‌కిది రెండో యాషెస్ టెస్టు కానుంది. కాగా 2023లో లార్డ్స్ జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ‘యాషెస్’ టెస్టు ఆడిన టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ జట్టు
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, విల్ జాక్స్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే?


