శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ చిక్కుల్లో పడ్డాడు. మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రణతుంగను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్‌లో అర్జున రణతుంగా శ్రీలంక తరఫున సత్తా చాటాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 1996లో కెప్టెన్ హోదాలో శ్రీలంకకు వన్డే వరల్డ్‌కప్ అందించాడు. రణతుంగ సారథ్యంలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి లంక టైటిల్ గెలవడంతో అతడి ప్రతిష్ట మరింత పెరిగింది.
ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత అర్జున రణతుంగా రాజకీయాల్లో ప్రవేశించాడు. శ్రీలంక రవాణా, విమానయాన శాఖ (2018- 19), పోర్ట్స్ అండ్ షిప్పింగ్ (2015- 17)శాఖ, పెట్రోలియం వనరుల అభివృద్ధి శాఖ (2017-18) మంత్రిగా పనిచేశాడు. అయితే, పెట్రోలియమ్ మినిస్టర్‌గా ఉన్న సమయంలో అతడు అవినీతికి పాల్పడినట్లు సమాచారం.
రూ. 23. 5 కోట్లు
ఈ కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ కొలంబో మెజిస్ట్రేట్ అసంగ బొడరగమా ముందు సోమవారం తమ వాదనలు వినిపించింది. మొత్తంగా 27సార్లు జరిపిన కొనుగోళ్లలో 800 మిలియన్ శ్రీలంకన్ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 23. 5 కోట్లు) అవినీతి జరిగినట్లు తాము గుర్తించినట్లు తెలిపింది.
కాగా ఈ కేసులో ఇప్పటికే అర్జున రణతుంగ అన్నయ్య, సిలోన్ పెట్రోలియమ్ చైర్మన్‌గా ఉన్న ధమ్మిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశాడు. అయితే, కాసేపటికే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
ధమ్మికకు శ్రీలంక పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉండటం గమనార్హం. కాగా అర్జున రణతుంగ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని.. స్వదేశానికి తిరిగి రాగానే అతడిని అరెస్టు చేయనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అర్జున రణతుంగ మరో సోదరుడు, పర్యాటక శాఖ మాజీ మంత్రి ప్రసన్న కూడా గత నెలలో ఫ్రాడ్ కేసులో అరెస్టయ్యాడు.
చదవండి: అక్షరాలా రూ.8 వేల కోట్లు!


