బాబు ఫైబర్‌నెట్‌ కుంభకోణానికి ఆధారాలు ఉన్నాయి | There is evidence of Chandra Babu Fibernet scam | Sakshi
Sakshi News home page

బాబు ఫైబర్‌నెట్‌ కుంభకోణానికి ఆధారాలు ఉన్నాయి

Dec 10 2025 2:06 AM | Updated on Dec 10 2025 2:06 AM

There is evidence of Chandra Babu Fibernet scam

చంద్రబాబు అక్రమాలపై సీఐడీ అన్ని ఆధారాలు సేకరించింది

90 మంది సాక్షులను విచారించింది.. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సైతం చేయించింది

ఆధారాలన్నీ రికార్డుల్లో ఉన్నాయి.. కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోవాలి

చట్ట ప్రకారం ఈ కేసులో కోర్టుకు మూడే ఆప్షన్లు ఉన్నాయి

కేసును విచారణకు స్వీకరించాలి లేదా తదుపరి దర్యాప్తునకు ఆదేశించాలి

లేదంటే ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను ప్రైవేటు ఫిర్యాదుగా తీసుకోవాలి

సీఐడీ క్లోజర్‌ రిపోర్ట్‌ను తీవ్రంగావ్యతిరేకించిన పొన్నవోలు

ఏసీబీ కోర్టులో సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధా­కర్‌రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఈ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పైన,  సీఐడీ పిటిషన్‌ను వ్యతిరే­కిస్తూ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ పూర్వ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ పైన కోర్టులో వాదనలు మంగళవారం పూర్తయ్యాయి.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయా­ధి­కారి భాస్కరరావు ఈ నెల 11న నిర్ణయం వెలువరిస్తానని ప్రకటించారు. అంతకుముందు పొన్నవోలు వాదనలు వినిపించారు. ‘చంద్రబాబు హయాంలో ఫైబర్‌నెట్‌ కాంట్రాక్ట్‌ అప్ప­గింత వ్యవహారంలో రూ.320 కోట్ల మేర అక్రమాలు జరిగా­యి. దీనిపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఫైబర్‌నెట్‌ లిమి­టెడ్‌ చైర్మన్‌ గౌతంరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. టెండర్‌ ప్రక్రి­యలో అక్రమాలపై సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి, ఆధా­రాలు సేకరించింది. వాటి ఆధారంగా కేసు నమోదు చేసింది. 

ఈ విషయంలో సీఐడీ హడావుడిగా వ్యవహరించలేదు. ప్రాథ­మిక ఆధారాలతోనే చంద్రబాబును నిందితునిగా చేర్చింది. అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. సీఐడీ 90 మంది సాక్షులను విచారించింది. మొత్తం ఆధా­రాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించింది. అక్రమాలు జరి­గినట్లు అందులో కూడా నిర్ధారణ అయింది. ఈ రికార్డులన్నీ కోర్టు ముందున్నాయి’ అని తెలిపారు. 

ప్రభుత్వం మారడం, చంద్రబాబు సీఎం అవడంతో ఆ ఆధారాలను, సాక్ష్యాలను సీఐడీ మూలన పడేసిందన్నారు. చంద్రబాబుపై కేసులో సా­క్ష్యాలు లేవని, అందువల్ల కేసును మూసివేయాలని కోరుతూ క్లోజర్‌ రిపోర్ట్‌ దాఖలు చేసిందన్నారు. ఇందుకు చట్ట నిబంధనలు అంగీకరించవని చెప్పారు. సీఐడీ సేకరించిన ప్రతి ఆధారం కోర్టు రికార్డుల్లో ఉందని అలాంటప్పుడు సీఐడీ క్లోజర్‌ రిపోర్ట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదన్నారు. 

ఇలా చేస్తే ప్రజలకు కోర్టులపై విశ్వాసం పోతుంది..
ఈ కేసులో కోర్టుకు చట్ట ప్రకారం 3 ఆప్షన్లు మాత్రమే ఉన్నా­యని సుధాకర్‌రెడ్డి వివరించారు. కోర్టు ముందున్న సాక్ష్యాలను పరి­గణనలోకి తీసుకుని కేసును విచారించడం లేదా సాక్ష్యాధా­రాలు సరిపోవనుకుంటే తదుపరి దర్యాప్తునకు ఆదేశించడం లేదా గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను ప్రైవేటు ఫిర్యాదుగా తీసుకోవడం అని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టులపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 

ఈ సందర్భంగా ఆయన ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ గవాయ్‌ న్యాయాధి­కారులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మనసుల్లో న్యాయవ్యవçస్థపై నమ్మకం సన్నగిల్లితే వారు కోర్టులకు రారని, ఇది అంతిమంగా అరాచకానికి దారి తీస్తుందని, దీని వల్ల ప్రజలు వీధుల్లోనే తమ వి­వాదాలను పరిష్కరించుకునే పరిస్థితి వస్తుందని చెప్పారని  వివరించారు.

అధికార బలంతో తప్పును కడిగేసుకుంటున్నారు..
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే గత ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని, అందులో భాగంగా ఈ ప్రొటెస్ట్‌ పిటిషన్‌ కూ­డా దాఖ­లు చేశారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలి­పారు. దీనిపై సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీరు అధికారం బలంతో మీ తప్పులను కడిగేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, సీఐడీ క్లోజర్‌ రిపోర్టులను ఆమో­దిస్తూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను ఈ పిటిషన్‌కు జత చేయలేదని అనగా.. సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. 

తమకు సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వొ­ద్దని సీఐడీ చాలా గట్టిగా చెప్పిందన్నారు. దీంతో ఈ కోర్టు తమ­కు ఆ కాపీలు ఇవ్వలేదని, అలాంటప్పుడు వాటిని ఎలా తెస్తా­మని ప్రశ్నించారు. కాపీలు ఇవ్వొద్దన్న సీఐడీనే ఇప్పుడు వాటిని జత చేయలేదని ఎలా ఫిర్యాదు చేస్తుందని నిలదీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement