ఫైబర్‌నెట్‌ కేసు క్లోజ్‌! | Chandrababu Naidu closes fiber net scam case | Sakshi
Sakshi News home page

ఫైబర్‌నెట్‌ కేసు క్లోజ్‌!

Dec 12 2025 3:01 AM | Updated on Dec 12 2025 3:01 AM

Chandrababu Naidu closes fiber net scam case

ఇప్పటికే అసైన్డ్‌ భూములు, మద్యం, ఉచిత ఇసుక కేసులు మూసివేత 

సీఐడీని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వైనం.. 

మాట వినని అధికారుల సస్పెన్షన్లు, బదిలీలు 

గతంలో ఫిర్యాదు చేసిన అధికారులపైనా ఒత్తిళ్లు

సేకరించిన సాక్ష్యాలు..నిర్ధారించిన అక్రమాలు అటకపైకి.. 

ఛార్జిషీట్లు సైతం బుట్టదాఖలా.. 

మరిన్ని కేసుల మూసివేతకు రంగం సిద్ధం

సాక్షి, అమరావతి: ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసులో సైతం అనుకున్నదే జరిగింది. ఇప్పటికే పలు కుంభకోణాలకు సంబంధించి సీఐడీ గతంలో నమోదు చేసిన కేసులను కొట్టేయించుకున్న సీఎం చంద్రబాబు తాజాగా ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసును కూడా విజ­య­వంతంగా కొట్టేయించుకున్నారు. ప్రభుత్వం అధీనంలో పనిచేసే సీఐడీని పూర్తిగా అదుపులోకి తీసుకుని అధికారులను ప్రభావితం చేసి అనుకూలంగా మార్చుకున్నారు. మాటవినని అధికారులను సస్పెండ్‌ చేశారు. పలువురిని బదిలీ చేశారు. దాంతో సీఐడీ కేసులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.

కుంభకోణాలపై అనేక ఆధారాలు సేకరించిన సీఐడీ...
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్య­మంత్రిగా ఉన్న సమయంలో పలు కుంభకోణాలు జరిగాయి. అసైన్డ్‌ భూముల కుంభకోణంపై 2020లో, ఫైబర్‌ నెట్‌ కుంభకోణంపై 2021లో, మద్యం కుంభకోణం, ఉచిత ఇసుక కుంభకోణా­లపై సీఐడీ 2023లో పలు కేసులు నమోదు చేసింది. చంద్రబాబు, ఆయన మంత్రివర్గంలో ఉన్న పలువురిని నిందితులుగా చేర్చింది. చాలా మంది కీలక సాక్షులను విచారించింది. 

చంద్రబాబు తదితరుల అక్రమాలను, అవకతవకలను, ఆశ్రిత పక్షపాతాన్ని రుజువుచేసే పలు సాక్ష్యాధారాలను సీఐడీ సేకరించింది. అక్రమాలను నిర్ధారించింది. సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి ఏసీబీ కోర్టులో చార్జిషీట్లు సైతం దాఖలు చేసింది.

నిందితులే పాలకులు కావడంతో...
ప్రభుత్వం మారడం, గతంలో పలు కుంభకోణాల కేసులో నిందితులుగా ఉన్న చంద్రబాబు ము­ఖ్యమంత్రి కావడం, అలాగే లోకేశ్, నారాయణ, అచ్చె­న్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులు మంత్రులు కావడంతో పరిస్థితి మారిపోయింది. పరిపాలన మొత్తం తమ చెప్పు చేతల్లో ఉండటంతో నిందితులు­గా ఉన్న వారు సీఐడీ అధికారులను తీవ్ర­ంగా ప్రభా­వితం చేశారు. తమపై కేసులు నమో­దు చేసి దర్యాప్తు చేసిన పలువురు అధికారులను సస్పెండ్‌ చేశారు. మ­రి­కొందరిని బదిలీ చేశా­రు. 

తమకు కావా­ల్సిన వారి­ని సీఐడీలోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో గతంలో తమపై సీఐడీకి ఫిర్యాదు చేసి­న అధికారులు వాసుదేవరెడ్డి, మధుసూధన్‌రెడ్డి తదితరులను తమ గుప్పె­ట్లో పె­ట్టు­కున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్, నారా­యణ తదితరులపై కేసుల మూసివేతకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. గతంలో దర్యాప్తు చేసి సేకరించిన కీలక సాక్ష్యాధారాలన్నింటినీ మూలనపడేసింది.

అంతా రహస్యమే...
చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసులను మూసివేయాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పలు పిటిషన్లు దాఖలు చేసింది. వాటిని అత్యంత రహస్యంగా ఉంచింది. ఫిర్యాదుదారులైన వాసుదేవరెడ్డి, మధుసూధన్‌రెడ్డి వంటి అధికారులను కోర్టుకు తీసుకొచ్చింది. చంద్రబాబు తదితరులపై కేసుల ఉపసంహరణకు తమకు ఎలా­ంటి అభ్యంతరం లేదని వారి చేత చెప్పించింది. ఏసీబీ కోర్టు సైతం వాస్తవ ఫిర్యాదుదారులు ఎవరో తెలు­సు­కోకుండా చంద్రబాబు తదితరులపై దాఖ­లైన పలు కేసులను మూసివేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది. ఇదంతా గుట్టు చప్పుడు కాకు­ండా జరిగిపోయింది. 

చంద్రబాబుపై కేసులను మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఏ కారణంతో ఏసీబీ కోర్టు చంద్ర­బాబు తదితరులపై కేసులను మూసివేసిందో కూడా తెలియడం లేదు. చంద్రబాబుపై కేసుల మూసి­వేత వ్యవహారం ఇంత రహస్యంగా సాగుతుండటంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వండి...
ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్, నారాయణ తదిత రులపై అసైన్డ్‌ భూములు, మద్యం, ఉచిత ఇసుక కుంభకోణాలకు సంబంధించి సీఐడీ నమో­దు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తులో భాగంగా నమోదు చేసిన వాంగ్మూలాలు, దర్యాప్తు పూర్తి చేసి దాఖలు చేసిన చార్జిషీట్లు, కేసులను మూసివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీలను అందచేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు విజయవాడ ఏసీబీ కోర్టులో థర్డ్‌ పార్టీ పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే ఆ కాపీలను అందచేసేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ 5వ తేదీన ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వుల కాపీ 6 రోజుల తర్వాత గురువారం బయటకు వచ్చింది. సువర్ణరాజు పిటిషన్‌ రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని, అందుకే ఆయన అభ్యర్థనను అనుమతించడం లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు.

గౌతంరెడ్డి ప్రొటెస్ట్‌ పిటిషన్‌ కొట్టివేత..
ఫైబర్‌ నెట్‌ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు­పై గతంలో తాము దాఖలు చేసిన కేసును మూసివేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. సీఐడీ దా­ఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ని వ్యతిరేకిస్తూ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ పూర్వ చైర్మన్, ఫిర్యాదుదారు అయిన పూ­నూరు గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. 

ఈ మేరకు న్యా­యాధి­కారి పి.భాస్కరరావు గురువారం తీర్పు వెలువరించారు. చంద్రబాబు తదితరులపై ఫైబర్‌ నెట్‌ మూసివేత కోసం సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్‌ని వ్యతిరేకిస్తూ గౌతంరెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

వాస్తవానికి ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసులో తాను ఫిర్యాదుదారునని, కేసు మూసివేతకు ముందు తనకు నోటీ­సులు ఇవ్వాల్సి ఉండగా, సీఐడీ ఆ పని చేయ­లేదని ఆయన కోర్టు దృష్టికి తీసు­కొచ్చారు. ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌కు అప్పట్లో ఎండీగా ఉన్న మధుసూధన్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన చేత కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెప్పించడం చట్ట విరుద్ధమని ఆయన వివరించారు.

ఫైబర్‌నెట్‌ రింగ్‌మాస్టర్‌ చంద్రబాబే
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాం (2024–19)లో యథేచ్ఛగా సాగిన దోపిడీ పర్వంలో ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కూడా ఒక అంకం. చంద్రబాబే ఈ కుంభకోణం రింగ్‌ మాస్టర్‌. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టి నిధులు కొల్ల­గొట్టారని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. అందుకే ఏ1గా చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్, ఇన్‌క్యాప్‌ సంస్థలకు అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావులతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. 

చంద్రబాబు పన్నాగం ప్రకారమే...
మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు చంద్రబాబు బరితెగించారు. తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించడం కోసం ఆయన్ను ఏపీ ఈ–గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యునిగా చేర్చారు.  నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. 

కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. ఎలా­ంటి మార్కెట్‌ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్‌ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్‌ విలువను అమా­ంతంగా పెంచేశారు. ఇక ఈ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్‌ కంపెనీ ప్రభు­త్వ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంది. 

కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. టెండర్ల ప్రక్రియ పార­దర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధి­కారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. 

నకిలీ ఇన్‌వాయిస్‌లతో నిధులు కొల్లగొట్టి..
ఇక ప్రాజెక్ట్‌ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్‌ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. 

వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. 

నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి, కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసిరకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది.

అక్రమాలు తేల్చిన మధుసూధన్‌రెడ్డితోనే అభ్యంతరం లేదని చెప్పించిన సీఐడీ...
ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఎండీగా మధుసూధన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను నిర్ధారించిన విషయాన్ని గౌతంరెడ్డి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన విషయాన్ని కూడా కోర్టుకు తెలియచేశారు. అయినా మధుసూధన్‌రెడ్డి ఫైబర్‌ నెట్‌ కుంభకోణంపై చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు అభ్యంతరం లేదని చెప్పడంపై గౌతంరెడ్డి తన పిటిషన్‌లో విస్మయం వ్యక్తం చేశారు. 

ఈ కుంభకోణం కేసులో సీఐడీ సేకరించిన ఆధారాలను, చార్జిషీట్లు పరిశీలించి ఆ తరువాతనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీఐడీ దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్ట్, గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌పై ఇటీవల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కరరావు గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. చంద్రబాబు తదితరులపై కేసు మూసివేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించారు. 

ఇదే సమయంలో గౌతంరెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఉత్తర్వులిచ్చారు. అయితే ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాలేదు. ఏ కారణాలతో సీఐడీ పిటిషన్‌ను అనుమతించారు, ఏ కారణాలతో గౌతంరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చారో అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement