మున్సిపల్ చైర్మన్‌కు మాజీమంత్రి బెదిరింపులు
దాతలు చేసిన పనులకూ బిల్లులు ఇవ్వాలంట
అక్రమ బిల్లుల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ‘పల్లె’ రుబాబు
పుట్టపర్తి టౌన్: ‘ఇప్పుడు అధికారం మా చేతుల్లో ఉంది. ఆ బిల్లులపై సంతకం పెట్టు. లేదంటే నీ బిల్డింగ్ కూలుస్తాం.. చెత్త ఎత్తనివ్వం. తాగునీరు కట్ చేస్తాం’.. ఇవీ టీడీపీ నేత, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతికి ఫోన్‌లో చేసిన బెదిరింపులు. అక్రమ బిల్లులపై సంతకాలు పెట్టాలంటూ పల్లె తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తేవడం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. వివరాలివీ.. ఇటీవల పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు సత్యసాయి సెంట్రల్ ట్రçస్ట్ చొరవతో ఘనంగా జరిగాయి.
ఇందుకోసం ప్రభుత్వం కొంతమేర నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ అవి విడుదల కాలేదు. దాతలు, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి నిధులు ఖర్చుచేసి భక్తులకు సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఈ మేరకు పుట్టపర్తి పట్టణ పరిసరాలు, చిత్రావతి నదీ పరీవాహక ప్రాంతంలో 11 చోట్ల రూ.4 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. అందులో కొన్ని పూర్తిచేశారు. మరికొన్ని పనులు సగంలోనే ఆగాయి.
అయితే, ఈ పనులకు సంబంధించి అక్రమంగా బిల్లులు చేసుకోవడానికి టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తాత్కాలిక మరుగుదొడ్లకు రూ.80 లక్షలతో పాటు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కాంట్రాక్టర్లు, దాతల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ పనులకు బిల్లులు చేసుకోవాలని నిర్ణయించుకుని.. వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతిని సంప్రదించారు. ఇందుకు ఆయన ససేమిరా అన్నారు.
పనులు పరిశీలించి సక్రమంగా, నాణ్యతగా ఉంటేనే బిల్లులపై సంతకాలు చేస్తామని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మున్సిపల్ చైర్మన్‌కు ఫోన్‌చేసి బెదిరింపులకు దిగారు. అధికారులు కూడా పల్లెకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.
తాటాకు చప్పుళ్లకు భయపడం
అక్రమంగా బిల్లులు చేయాలని మాజీమంత్రి
పల్లె రఘునాథరెడ్డి ఫోన్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. నేను ససేమిరా అనడంతో బెదిరింపులకు దిగుతున్నారు. అలాంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు. సక్రమంగా ఉంటేనే బిల్లులపై సంతకాలు పెట్టి కౌన్సిల్లో పాస్ చేస్తాం. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ప్రజల సొమ్ము ను దుర్వినియోగం కానివ్వం. – తుంగా ఓబుళపతి, మునిసిపల్ చైర్మన్, పుట్టపర్తి
గతంలో ఇలాంటి సంస్కృతి లేదు
మేం అధికారంలో ఉన్న ఐదేళ్లూ బాబా జయంత్యుత్సవాల సందర్భంగా పలు పనులను పారదర్శకంగా చేపట్టాం.
ఎక్కడా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాలేదు. ఇప్పుడు అక్రమ బిల్లులను మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రోత్సహిస్తున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లకు రూ.80 లక్షల బిల్లులు చేయమనడం.. దాతలు ఏర్పాటుచేసిన వాటికి కూడా బిల్లులు చేయమని చైర్మన్‌పై ఒత్తిడి చేయడం సమంజసం కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలిగానీ ఇలాంటి అక్రమాలు చేయడమేంటి? – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి


