సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాజమండ్రి ఎమ్మెల్యే, లిక్కర్ సిండికేట్ బాగోతాలను మరో టీడీపీ నేత బర్ల బాబురావు బట్టబయలు చేశారు. గతంలో వరుసగా టీడీపీ నేతలు మద్యం సిండికేట్ల ముడుపుల గురించి మాట్లాడిన ఆడియోలను బాబురావు విడుదల చేశారు. ఎక్సైజ్ సీఐ ముడుపుల దందా ఆడియోను సైతం బర్ల బాబురావు బయటపెట్టారు. తాను విడుదల చేసిన ఆడియోలు ఏఐ క్రియేషన్ కాదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాబురావు సవాల్ చేశారు. బర్ల బాబురావుతో బహిరంగ చర్చకి వచ్చేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు.
కాగా, గతంలో కూడా రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది.
రాజమండ్రి అర్బన్, రూరల్‌లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్‌చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మార్పికంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబులను దోచేసే పన్నాగం బయటపడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడే నగరంలోని సిండికేట్‌లో ఉన్న లిక్కర్ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


