ఢిల్లీ: ఓటర్ల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈసీ వ్యవహరించొద్దని.. ఎన్నికల సంఘం పారదర్శకంగా, స్వతంత్రంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కస్టోడియన్‌లా ఉండాలన్నారు. ఏపీ ఎన్నికల అవకతవకలపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు అడ్డుతగిలారు.
ఏపీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని.. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయని వైవీ అన్నారు. పని భారంతో బీఎల్వోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌరులకు ఎస్ఐఆర్ పైన తగిన సమాచారం ఇవ్వలేదు. నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల కౌంటింగ్‌లో అనేక లోపాలు బయటపడ్డాయి’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
‘‘మైదుకూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను మించి ఓట్లు రికార్డు అయ్యాయి. ఫామ్ 20లో మాత్రం జీరో ఓట్స్ రికార్డ్ చేశారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో జరిగింది. మా పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ ఎన్నికలకు 1 ఓటు మాత్రమే వచ్చింది. సాంకేతికతను ఉపయోగించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజ్‌ను కూడా ఇవ్వడం లేదు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ శాతం ఆకస్మాత్తుగా పెరగడం దేనికి సంకేతం’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.


