సాక్షి, తాడేపల్లి: అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని.. తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. గురువారం పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్‌ను కలిసి జరిగిన పరిణామాలను వివరించాయి.
ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజినగర్‌లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. ఆ సమయంలో కూల్చివేతలు అన్యాయమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. అయితే..


తమ ఇళ్ల కూల్చడంపై ఇవాళ జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదిన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని.. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు.


‘‘విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చారు. బాధితులంతా రోడ్ల మీద ఉన్నారు. ప్రభుత్వ పెద్దలందరినీ బాధితులు కలిశారు. అయినప్పటికీ వారికి కనీస భరోసా కూడా లభించలేదు. కార్పొరేషన్ మీటింగ్ లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్‌ని కలిశారు. ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామన్నారు’’ అని విజయవాడ వెస్ట్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.


