ఇజాలు నిజాలు వేర్వేరు...ఇజం నిజం కానక్కర్లేదు...నిజానికి ఇజం అక్కర్లేదు..ఇదే మన ముఖ్యమంత్రి బాబుగారి సిద్ధాంతమేమో అనిపిస్తోంది. చెప్పొచ్చేదేంటంటే...సర్కారు సంక్షేమ కాడిని కిందికి పడేసి...ప్రైవేటు భుజాన పెట్టేయడమే వారి దృష్టిలో అసలు సిసలు సంస్కరణ. మీకు డౌటనుమానమా? అయితే ఏపీలో కాస్త లుక్కేయండి...బాబుగోరు పవర్ లోకి వచ్చాక ఎన్ని విప్లవాలు పుట్టుకొచ్చాయో....వైద్యవిద్యను దెబ్బకు ప్రైవేటు పరం కానిచ్చి పరమానందంగా అలా ముందుకెళదాం అంటున్నారు. కావచ్చు మనకేంటి నష్టం? అంటారా? ప్రజలకు ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం పక్కా కమర్షియల్ గా మారిపోవడానికి ....ఆ వైద్యవిద్యపై కొందరు ఖర్చుపెట్టే లక్షలాది ఫీజులు కాదా. ఇలా ప్రతీది ప్రైవేటు అంటూ పోతే సర్కారుకు బరువు బాధ్యతలు పేలపిండిలెక్కన మారిపోవా? అని కొందరు బాధపడుతున్నారు.
.
అసలు బాబుగోరి రూటే వేరండి...మనకు అర్థం చేసుకునే బుర్ర ఉండాలి. వారిది మొదట్నుంచీ ఇదే స్టైల్. కాశీకి పోయి ఏదో ఒకటి వదిలేసేవారున్నట్లే...సర్కారు వచ్చాక దేన్నైనా ప్రైవేటు భుజాలపై పెట్టి వదిలించుకునే అలవాటున్నవారు మరి. అందుకే ఈసారి మెడికల్ కాలేజీ పై పడ్డారు. అన్నిటికీ మించి గత సర్కారు చేసిన ఏ మంచి పనినైనా సరే కెలకాల్సిన గొప్ప బాధ్యత అధికారంలోకి వచ్చాక ఉంటుంది కదా అనుకుంటున్నారేమో తెలీదు కానీ ...వైఎస్సార్ సీపీ అధికాంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవాలన్న అంశాన్ని ఇపుడు ప్రైవేటు వారికిచ్చేశారు. గతంలో మహారాజులు నచ్చిన వారికి అగ్రహారాలు రాసిచ్చినట్లు ఇపుడు ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు రెడీ అయిపోయారు. మరోపక్క విశాక స్టీల్ ప్రైవేటుపరం చేసే కుంపటి రగులుతునే ఉంది.
.
సీట్లు తక్కువొచ్చాయి కదా జగన్ పార్టీ ఏం చేస్తుందిలే అనుకుంటే...అంతకంతకూ పవర్ ఫుల్ గా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఇపుడు కో టి గళాల గర్జన అంటూ జగన్ మరో అంకానికి తెరలేపడంతో కూటమి అధినేత బాబుగారు జర గుస్సాఅవుతున్నారని వినికిడి. గత రెండు నెలలుగా వైఎస్పార్ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో కోటి సంతకాల సేకరణోద్యమం ఉధృతంగా సాగుతున్నది బాబుగారి దాకా చేరక పోతుందా? వారు కినుక వహించకుండా పోతారా? అన్నది కదా పాయింట్.
.
గత వైఎస్సార్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్ది బడుగు పిల్లల నోట ఇంగ్లీష్ మాటలు పలికించిన తీరు ఎంతకాదన్నా కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇబ్బందిగానే మారింది. ప్రైవేటు పాఠశాలల ఊసెత్తని తరం వచ్చేస్తోందన్న ఆందోళన అప్పట్లో వారిలో ఎంతుండేదని. కూటమి రాగానే హమ్మయ్యా మనకిక భయంలేదు...సర్కారు పాఠశాలలకు మళ్ళీ నిరాదరణ వైభోగం తప్పదనుకున్నారని సమాచారం. ఇపుడు మరి బాబుగారికి ఆలోచన ఏ బ్రహ్మీ ముహూర్తాన పుట్టిందో తెలీదు కానీ గత వైఎస్సార్ సీపీ సర్కారు హయంలో ఏర్పడ్డ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకున్నారు.
.
ఇది మున్ముందు సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బందిగా మారుతుంది. వైద్యం బడుగు ప్రజలకు అందుబాటులోకి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుంది...ఇవేవీ ఇపుడు వారి సిలబస్ లో లేని అంశాలు. అయినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ...ఆ వారసత్వ బాటలో నడచిన తనయుడు మాజీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సర్కారు విద్య సంస్కరణలు ప్రజలకు గుర్తుండే ఉంటుందిగా. మరీ ముఖ్యంగా ఇలా ప్రైవేటు పడగ విప్పినపుడు ఇంకా బాగా గుర్తొస్తుంటుంది.
- ఆరేం.


