అయ్యంకి(మొవ్వ): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనడం లేదని, ఇక తమకు ఆత్మ హత్యే శరణ్యమని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగు మందు డబ్బా పట్టుకుని కుటుంబ సభ్యులతో రోడ్డెక్కాడు. ఈ ఘటన మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ధాన్యం రోడ్ల పైనే ఎండపెట్టి తేమ శాతం 16 వచ్చినా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనలేదు. ఇదే అదనుగా దళారులు రూ.1,200కు ఇస్తావా అని అడుగుతుండడంతో రైతులు దిక్కు దోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
అయ్యంకి గ్రామానికి చెందిన రాజులపాటి మోహనకృష్ణ పదెకరాలు కౌలుకు తీసు కుని వ్యవసాయం చేస్తున్నాడు. యంత్రాల ద్వారా ధాన్యం నూర్చి బుధవారం నాటికి 16 రోజులుగా ఎండపెట్టాడు. తేమ శాతం 16 వచ్చింది. రోజుకు రూ.3,200 కూలి ఖర్చవుతున్నా గత్యంతరం లేక ధాన్యం పాడవకుండా అరపెడుతున్నాడు. అయితే ధాన్యం అమ్ముడుపోక పోవటం, వేలకు వేలు అదనపు ఖర్చవటంతో ఆ రైతు పడుతున్న ఆవేదన వర్ణనా తీతంగా మారింది. దీంతో పురుగుమందు డబ్బా పట్టుకొని రోడ్డెక్కిన రైతు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ధాన్యాన్ని న్యాయమైన ధరకు కొనుగోలు చేసి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు.


