హిందూపురం: ఓ కోర్టు కేసు విషయమై అడిగేందుకు వెళ్లిన న్యాయవాది అబ్దుల్ రహీంపై దురుసుగా ప్రవర్తించి, ‘ఆఫ్ట్రాల్ అడ్వొకేట్’ అంటూ స్టేషన్ నుంచి గెంటేసిన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు తీరును నిరసిస్తూ న్యాయవాదులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వన్నేరువప్ప, కార్యదర్శి రామచంద్రప్ప ఆధ్వర్యంలో హిందూపురంలో విధులను బహిష్కరించి, అంబేడ్కర్ సర్కిల్‌కు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ మానవహారంగా ఏర్పడడంతో పాటు రాస్తారోకో చేశారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఓ సివిల్ వివాదం కోర్టులో నడుస్తుండగానే వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్ చేసి వ్యతిరేక పక్షానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో న్యాయవాది అబ్దుల్ రహీం మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సివిల్ వివాదంలో ఏ హక్కుతో జోక్యం చేసుకున్నారని సీఐను ప్రశ్నించారు. దీంతో సీఐ ఆగ్రహంతో స్టేషన్ నుంచి బయటకు పో అంటూ న్యాయవాదిపై దురుసుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బందితో దాడి చేయించి.. స్టేషన్ నుంచి బయటకు నెట్టేశారు. ‘ఆఫ్ట్రాల్ అడ్వొకేట్’ అంటూ అవహేళనగా మాట్లాడారు.
దీనిపై న్యాయవాది రహీం స్థానిక బార్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు న్యాయవాదులు బుధవారం విధులను బహిష్కరించి అంబేడ్కర్ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఎస్పీ వచ్చి సీఐపై చర్యలు తీసుకునే దాకా ఆందోళన విరమించేదిలేదని భీష్మించారు. వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు కానిస్టేబుళ్లతో అక్కడికి వచ్చి వీడియో తీస్తూ హల్‌చల్ చేశారు. ‘అందర్నీ వీడియోలు తీసుకోండి. కేసులు నమోదు చేద్దాం’ అంటూ సిబ్బందిని ఆదేశించారు. సీఐ వైఖరితో మరింత ఆగ్రహించిన న్యాయవాదులు దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ స్తంభించింది.


