శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ పెరగడంతో తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు ఈ రైళ్లు అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్‌ల మీదుగా శబరిమలకు చేరుకుంటాయి. డిసెంబర్ 13 నుంచి 31 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి వెళ్తాయో వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు ఇప్పటికే సుమారు 60 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.

చర్లపల్లి -కొల్లం జంక్షన్ (07119), సిర్పూర్ కాగజ్ నగర్ -కొల్లం జంక్షన్ (రైలు నం. 07117), చర్లపల్లి -కొల్లం జంక్షన్ (07121), నాందేడ్ - కొల్లం (07123) రైళ్లకు డిసెంబర్ 3 నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు రైళ్లకు బుధవారం ఉదయం 8గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


