సాక్షి, కేరళ: శబరిమల యాత్ర ముగిసిన తర్వాత పంపా నదిలో భక్తులు వదిలేసిన దుస్తులతో చెత్తకుప్పలా మారింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం అధికారుల తీరుని తప్పుపబట్టింది. అలాగే ఈ దుస్తులను తొలగించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి శబరిమల సీజన్ ముగిసిన తర్వాత పంపా నదిని శుభ్రం చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి. జయకుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
నదిలో పేరుకుపోయిన బట్టల కుప్పలు పర్యావరణానికి, జలచరాలకు ముప్పుగా మారుతుందని స్పష్టం చేసింది. చాలామంది భక్తులు దీన్ని ఆచారంగా భావిస్తున్నారు..కానీ ఇది శబరిమల సంప్రదాయంలో భాగం కానేకాదని, అదొక అపోహని పేర్కొంది. భక్తులకు దీనిపై అవగాహన పెంచాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. నిజానికి ఇలా నదిలో వదిలేసిన బట్టలు కుళ్లిపోయి దుర్వాసన రావడమే గాక, ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది.
పైగా ఈ వ్యర్థాల వల్ల చేపలు వంటి జలచరాలు మృత్యువాతపడుతున్నాయని పేర్కొంది. కేవలం నదిలో తేలే బట్టలను మాత్రమే కాకుండా, నది అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే సుచిత్ర మిషన్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పంతినం తిట్ట జిల్లా యంత్రాంగం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పంపా నదిని యథాస్థితికి తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని దేవస్వం బోర్డును ఆదేశిస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది కేరళ హైకోర్టు.
కాగా, ఈ పంపా నది కేరళలో మూడవ అతి పొడవైన నది. దక్షిణ గంగగా పూజలందుకుంటోంది. ఇడుక్కిలోని పీర్మేడు పీఠభూమిలోని పొగమంచుతో నిండిన పులచిమలై కొండల నుంచి ఉద్భవించి, అరుదైన ఔషధ వృక్షజాలంతో సమృద్ధిగా ఉన్న అడవుల గుండా ప్రవహించే ఈ పవిత్ర నది ప్రతి అలలోనూ ఇతిహాసాలు, గొప్ప చరిత్రను దాచుకుంది. ఒకప్పుడూ స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచిన అవే జలాలు ఇలా భక్తులు వదిలేసిన బట్టలు, పూసల మాలలు వంటి వాటితో కలుషితమవుతోంది. ఉనికిలోని ఆచారంతో పవిత్రమైన నదిని కాస్తా అపవిత్రంగా మారుస్తుండటం బాధకరం.
(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!)


