అడవి అంటే సహజసిద్ధంగా ఏర్పడేదనేది తెలుసు అందరికి. కానీ చేతితో సృష్టించిన వనం గురించి విన్నారా. ఔను ఇది నిజం. చేతితో అడవిని సృష్టించడమా? అని ఆశ్చర్యం వేసినా..నమ్మకతప్పని సత్యం ఇది. అది కూడా ఓ 92 ఏళ్ల వృద్ధురాలి చేతి నుంచి పరుచుకన్న పచ్చదనం. అది ఆమె ఆరాటం నుంచి పుట్టుకొచ్చిన ప్రకృతి తపోవనంలా అచ్చంత ఆహ్లాదభరితంగా అలారారుతుంది. వాతావరణ మార్పు కోసం గత కొన్నేళ్లుగా పచ్చదనం అనే మంత్రం జపిస్తున్నాం కానీ..అంతకుమునుపు నుంచే ఈ దేవకి అమ్మ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి..అందుకోసం కృషి చేశారామె. చెట్టు విలువ తెలసిన అమ్మ ఈమె. ఆమె పెంచిన అడవిలో ఉండే మొక్కలు గురించి విన్నా..విస్తుపోవాల్సిందే..!. అసలు ఈ దేవికి అమ్మ ఎవరు..? అడవిని సృష్టించాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే..
కేరళలోని అలప్పుజలోని ఓ చిన్న గ్రామానికి చెంది దేవికి అమ్మ నలబై ఏళ్ల కృఫి ఫలితమే ఈ తపోవనం. ఇది ఆమె చేతితో సృష్టించిన అడవి. ఇక్క ఎన్నో ఔషధ మోక్కలు, చేపలు, పక్షుల సందడితో ఆహ్లాదభరితమైన పర్యావరణ సమతుల్యత కనిపిస్తుంది. మనకు కలిగిన శారీరక కష్టానికి కాసింత కలత చెంది..ఆరోగ్యంగా ఉండేందుకు యత్నిస్తాం. కానీ ఈ దేవికి అమ్మ అలా కాదు..తాను అనుభవించిన శారీరక బాధకు ఉపశమన మొక్కలుగా భావించడం విశేషం. అనుకోని ఓ ప్రమాదం కారణంగా అంగవైకల్యంతో మంచానికే పరిమితమైంది దేవకి.
బాధకు ఉపశమనంగా చెట్ల పెంపకం..
దాంతో ఎప్పటికీ వరిపొలం పనులు చేసే అవకాశం లేకుండాపోయింది. ఏళ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకున్న దేవకీ..ఆ పనులకు స్వస్తిచెప్పక తప్పలేదు. తనంతట తాను నడవలేని దైన్యస్థితితో చాలా పోరాడింది. చివరికి చికిత్స తీసుకుంటూనే తన పనులు తను చేసుకునేలా ఉండాలన్న సంకల్పం..కర్ర ఊతంతో నడవగలిగే శక్తిని అందించింది. ఆ కాసింత శక్తితోనే ఏదో ఒకటి చేయాలని ఆరాటపడింది. ఎలాగో ఈ శారీరక వైకల్యంతో వ్యవసాయం అంటే కష్టమే అందుకని..తన ఇంటి వెనుక ఉన్న బంజరు భూమిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది.
రోజుకు ఒక మొక్క చొప్పున నాటడం, దానితో కాసేపు గడపడం వంటి పనులతో తన శారీరక రుగ్మత నుంచి బయటపడే యత్నం చేసింది. ఇలా నాలుగు దశబ్దాలుగా తన రోజువారీ దినచర్యలో మొక్కలు నాటడం అనేది భాగంగా మారింది. అలా చూస్తుండగానే ఐదు ఎకరాల్లో పరుచుకున్న సహజసిద్ధమైన అడవిగా రూపాంతరం చెందింది. ఈ అడవిలో వివిధ జాతుల చెట్లు,పొదలు, ఔషధ మొక్కలకు నిలయం.ఇక్కడ ప్రత్యేక చెట్లలో ఒకటి కమండలు. దీన్ని కాలాబాస్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఋషులు తపస్సు నిమత్తమై వినియోగించే కమండలం కోసం ఈ చెట్టునే వినియోగిస్తారు.
అందుకే దీన్ని కమండలు వృక్షం అనిపిలుస్తారు. అంతేగాదు ధ్యాన సమయంలో ఈ చెట్టు కొమ్మలనే ఆధారం చేసుకుంటారు. ఇదేగాక నెమలి మొక్క..అని మరో ప్రత్యేకమైన మొక్క ఉంది. దీని ఆకులు నెమలి ఈకను పోలి ఉంటాయి. ఇవేగాక అంజూర చెట్లు, ఇండియన్ బ్లాక్‌బెర్రీ, జాక్‌ఫ్రూట్, మామిడి, అడవి బెర్రీలు, వేసవిలో ఆకురాల్చు బుద్ధచెట్టు తదితరాలు ఉన్నాయి. ఈ పచ్చదనం మధ్యలో క్యాట్‌ఫిష్ వంటి చేపలు, స్నేక్‌హెడ్ ముర్రెల్‌తో నిండిన చిన్న చెరువు వంటివి ఉన్నాయి.
ఈ చేపలు తినే పక్షులు, ఈగల్, వేటాడే పక్షులు కిలకిలరావాలతో మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నట్లుగా ఉంటుంది. సముద్రానికి సమీపంలో బ్యాక్‌వాటర్స్(ఉప్పునీరు లాంటి చిన్న చెరువులు) మధ్య ఇలాంటి అడవినా..! అని అక్కడకు వచ్చే జనాలు విస్తుపోతుంటారు. తెల్లటి ఇసుక, చుట్టూ ఉప్పు నీరు మధ్య పచ్చదనం అనేది చాలా కష్టం. కానీ దేవికి అమ్మ పట్టుదల..ఈ వృక్ష సంపదకు మూలం. ఆ అమ్మ చుట్టు పక్కల వాళ్లకు ఉచితంగా ఆ అడవిలోని మొక్కలను అందిస్తుంది. అంతేగాదు అందరు వచ్చి సందర్శించొచ్చు కూడా. అందుకు ఎలాంటి రుసుము తీసుకోదామె.
ఇది ప్రకృతి ప్రసాదమని అవి అందరి హక్కు అని అంటుంటారామె. ఒక చెట్టును నాటడం అనేది కార్బన్ పాదముద్రను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇక్కడ ఈ దేవికి అమ్మ అదే చేశారు. అందుకే భారత ప్రభుత్వం ఆమె నిస్వార్థ సేవను గుర్తించి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్‌సంగ్ హీరోస్ విభాగంలో పద్మశ్రీతో సత్కరించింది. అంతేగాదు అడవుల పెంపకం, పరిరక్షణకు సంబంధించి పర్యావరణ బాధ్యత ఎలా ఉంటుందో చేతల ద్వారా చూపించి ఆదర్శంగా నిలిచింది ఈ దేవకి అమ్మ..!.
(చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..)


