పెట్రోల్‌ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? | Kids Story On iran america war | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

Mar 14 2026 1:01 PM | Updated on Mar 14 2026 1:21 PM

Kids Story On iran america war

పిల్లలూ... పేపర్లలో, న్యూస్‌పేపర్లలో యుద్ధాలు చూస్తున్నాం. ఈ యుద్ధాలు పైకి ఏ కారణంతో జరిగినా చాలా మటుకు వీటి వెనుక ‘పెట్రోల్‌’ ఉంటుంది. పెట్రోల్‌ ప్రపంచానికి చాలా ముఖ్యమైన ఇంధనం. అది కొన్నిచోట్లే దొరుకుతుంది. అందుకని దాని కోసం చాలా పోరాటాలు సాగుతూ ఉంటాయి. మనం రోజూ బయటకు వెళ్లాలంటే ఏదో ఒక వాహనం కావాలి. అది నడవాలంటే పెట్రోల్‌ కావాల్సిందే!  రోజూ లక్షలాది కార్లు, మోటార్‌ సైకిళ్ళు, యంత్రాలు పెట్రోల్‌ సాయంతో నడుస్తాయి. 

వందల మిలియన్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో పెట్రోల్‌ నిక్షేపాలు ఏర్పడ్డాయి. ΄ప్లాంక్టన్, ఆల్కే వంటి చిన్న సముద్ర జీవులు మహాసముద్రాలలో నివసించేవి. ఈ జీవులు చనిపోయినప్పుడు, వాటి అవశేషాలు సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయాయి. కాలక్రమేణా ఈ పదార్థాలు సముద్రపు అడుగుభాగంలోని బురద, ఇసుక అవక్షేపాలతో కలిసిపోయాయి. ఆ పోరలు మరింతగా పేరుకుపోవడంతో అవశేషాలు భూమి ఉపరితలం కింద మరింత లోతుగా ఏర్పడ్డాయి. అలా ఇంధన నిక్షేపాలు తయారయ్యాయి. 

భౌగోళిక పరిస్థితులను బట్టి, పెట్రోల్‌ ఏర్పడటానికి దారితీసే ముడి చమురు ఏర్పడటానికి 10 మిలియన్ల నుండి 300 మిలియన్‌ సంవత్సరాలు పట్టవచ్చు. అయితే పెట్రోల్‌ నేరుగా తయారు కాదు. భూమి అడుగులోని ముడిసరుకును బయటకు తీసి, కర్మాగారాల్లో దాన్ని రిఫైన్‌ చేసి పెట్రోల్‌గా మారుస్తారు. కొన్ని దేశాలలో పెట్రోల్‌ని ‘గ్యాసోలిన్‌’ అని కూడా పిలుస్తారు. 

కార్బన్‌  డై ఆక్సైడ్‌ నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది సాధ్యమైతే పెట్రోల్‌ ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఛార్జ్‌ చేసి వాడటం ద్వారా పెట్రోల్‌ ఖర్చు తగ్గించడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement