గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్.. | LPG Cylinder Shortage Hits Kozhikode Crematoriums, Smrutipatham Temporarily Suspends Gas Based Funeral Services | Sakshi
Sakshi News home page

గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్..

Mar 14 2026 11:20 AM | Updated on Mar 14 2026 12:20 PM

Cremations Suspended at Kozhikode Crematorium amid LPG Shortage

కోజికోడ్: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు స్మశానవాటికల వరకూ పాకింది. కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే  ‘స్మృతిపథం’ స్మశానవాటికలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో, శుక్రవారం నుంచి గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

సంప్రదాయ పద్ధతులే శరణ్యం
గత రెండు రోజులుగా సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా సరఫరాదారులు కొత్త స్టాక్ పంపలేదని స్మృతిపథం సిబ్బంది వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్‌లను మూసివేసి, ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచు, చిప్పలను ఉపయోగిస్తూ, సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా మూలనపడింది. వారం రోజుల్లోగా దీనికి మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

సామాన్యులపై అదనపు భారం
సాధారణంగా మిగతా చోట్ల కంటే స్మృతిపథంలో అంతిమ సంస్కారాల ఖర్చు తక్కువ. ఇక్కడ గ్యాస్ ఆధారిత దహనానికి ₹2,000, ఎలక్ట్రిక్ పద్ధతికి ₹2,500 వసూలు చేస్తారు. గ్యాస్ కొరత కారణంగా దహన సంస్కారాల కోసం ఇప్పుడు కుటుంబ సభ్యులు పుతియాపాలం లేదా వెస్ట్ హిల్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో కుటుంబంపై అదనంగా ₹500 నుండి ₹1,500 వరకు ఆర్థిక భారం పడుతోంది.

ఒక మృతదేహానికి 25 కిలోల గ్యాస్‌
సాధారణంగా ఒక మృతదేహాన్ని గ్యాస్ ద్వారా దహనం చేయడానికి సుమారు 25 కిలోల గ్యాస్ అవసరమవుతుంది. అంటే దాదాపు ఒకటిన్నర కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. దహన ప్రక్రియలో తగినంత ఒత్తిడి కొనసాగించాలంటే ఒకేసారి 12 సిలిండర్లను ఫర్నేస్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఇక్కడ సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు  చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్‌డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement